KCR Movie: విభూది ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రీన్ ట్రి ప్రొడక్షన్స్ ద్వారా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేశవ చంద్ర రమావత్. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ ప్రధాన పాత్రలుగా తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, తనికెళ్ల భరణి ధనరాజ్, మైమ్ మధు తదితరులు కీలకపాత్రలో పోషించారు. అయితే ఈ చిత్రాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు మరికొందరు పార్టీ కార్యకర్తలతో కలిసి చూడడం జరిగింది.
ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ… “జబర్దస్త్ తో అందరికీ పరిచయమై ఈరోజు వెండి తెరకు చేరిన రాకేష్ కి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన కళాకారులకు, సినిమా టీంకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రం చాలా అద్భుతంగా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకి ఆ తర్వాతకి ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తూ ఓ మంచి ప్రేమ కథతో తెలంగాణ గ్రామీణ వాతావరణానికి జోడించి ఈ చిత్రం తీయడం జరిగింది. సెంటిమెంటులతో మంచి ఎమోషన్ తో ఈ చిత్రాన్ని ఎక్కడ బోర్ కొట్టకుండా చిత్రం తెరకెక్కించారు. ఒక వైపు తెలంగాణ అభివృద్ధి చేసిన తీరును చూపిస్తూ గ్రామీణ వాతావరణం జీవితాలను వారి జీవనశైలి చాలా అద్భుతంగా చూపించారు. మరొకసారి ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రాకేష్ ముందు ముందు మరెన్నో సందేశాత్మక సినిమాలను తీయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ… “ఈ సినిమాను మొదటి నుండి ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకు ఎంత పెద్ద అవార్డు వచ్చిన హరీష్ రావు గారు రావడం అనేది అంతకంటే ఎంతో పెద్ద అవార్డు. హరీష్ రావు గారు వచ్చి ఈ సినిమాని చూడటమే ఈ సినిమాకు వచ్చిన ఆస్కార్ అవార్డుగా భావిస్తున్నాను. హరీష్ రావు గారు వచ్చి ఈ సినిమాను చూడటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.
బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ... “కెసిఆర్ సినిమా చూడటం జరిగింది. చిత్ర బృందం ఏంతో అందంగా గ్రామీణ వాతావరణం, అలాగే హైదరాబాద్ లో చిత్రీకరించారు. కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరంలో తెలంగాణను ఎంతగా అభివృద్ధి చేశారో చూపిస్తూ ఈ సినిమా తీశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామీణ కథను కేసీఆర్ గారితో కలుపుతూ ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పుతూ ఈ సినిమా తీయడం అద్భుతంగా అనిపిస్తుంది. రాకేష్ గారు భవిష్యత్తులో ఇలాగే మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము” అన్నారు.