పండుగలు మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమని, మన వారసత్వాన్ని గుర్తు చేసే ఆనంద వేడుకలు అని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కేఎస్ రామారావు అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో దాండియా, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ.. ‘‘నవరాత్రి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన సద్దుల బతుకమ్మ, దేశంలో అత్యంత ప్రాచుర్యం ఉన్న దాండియాలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. అందుకే ఈ రెండు వేడుకలను మన సభ్యుల కోసం ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు.

ఎఫ్.ఎన్.సి.సి కార్యదర్శి తుమ్మల రంగారావు మాట్లాడుతూ.. ‘‘మన కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొంటారు. అందుకే ఈసారి దాండియా, బతుకమ్మ పండుగల కోసం భారీ ఏర్పాట్లు చేశాం. అలాగే ప్రత్యేక వంటకాలను కూడా సిద్ధం చేశాం’’ అని చెప్పారు.
ఎఫ్.ఎన్.సి.సి కోశాధికారి శైలజ మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమాల్లో మహిళలు, పిల్లలు పాల్గొని దాండియా, బతుకమ్మ ఆడటం కన్నుల పండుగగా ఉంది. ఇలాంటి వేడుకలను మన సెంటర్లో తరచుగా ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్.ఎన్.సి.సి అధ్యక్షులు కె.ఎస్ రామారావు, ఉపాధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మలరంగరావు, సంయుక్త కార్యదర్శి సదాశివరెడ్డి, కోశాధికారి జే శైలజతో పాటు కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కే మురళీమోహన్ రావు, ఏడిద రాజా, ఎస్ నవకాంత్, భాస్కర్ నాయుడు, బాలరాజు, వీవీ గోపాలకృష్ణంరాజు, సీహెచ్ వరప్రసాద్ రావు, కోగంటి భవాని పాల్గొన్నారు. మీడియా కమిటీ చైర్మన్ భగీరథ అలాగే కల్చరల్ కమిటీ చైర్మన్ సురేశ్ కొండేటి, సభ్యులు పద్మజ, శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

