సెప్టెంబ‌ర్ 28న రాబోతోన్న ‘చంద్రముఖి 2’ అందరికీ నచ్చుతుంది: రాఘవ లారెన్స్

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యువి మీడియా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘రెబల్ తరువాత నాకు డైరెక్షన్ చేసే టైం కుదరలేదు. ఇలా చంద్రముఖి 2 సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఏమీ ఆశించకుండా ప్రేమిస్తుంటారు. నేను ఎప్పుడూ దేవుడ్ని చూడలేదు. ఈ ప్రేమ పేరే దేవుడని అనుకుంటున్నాను. నేను డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రతీ హీరో అభిమాని నాకు ఫ్యాన్ అయ్యారు. నాకు ఛాన్స్ ఇచ్చిన హీరోలందరికీ థాంక్స్. ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ థాంక్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి చెప్పాలి. ఆయన నటించిన చిత్రంలో నేను నటించాను. వాసు గారు కథ చెప్పారు.. నేను చేయొచ్చా? అని అడిగాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నా లైఫ్‌లో నేను ముగ్గురినీ ఎప్పుడూ మరిచిపోను. రజినీ కాంత్ గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాదు. మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మీ అభిమానం నాకు వచ్చేది కాదు. డైరెక్షన్ ఛాన్స్‌ను నాగార్జున గారు ఇచ్చారు.

కీరవాణి గారికి మ్యూజిక్ తప్పితే ఇంకేం తెలియదు. అదే లోకంలో ఉంటారు. ఆయన సంగీత సారధ్యంతో మేం పని చేయడం ఆనందంగా ఉంది. నేను గ్రూప్ డ్యాన్సర్‌గా పని చేస్తున్నప్పటి నుంచీ పి. వాసు గారు ఇంకా దర్శకత్వం వహిస్తూనే ఉన్నారు. ఈ వయసులోనూ ఆయన చాలానే కష్టపడుతుంటారు. నా బాడీ లాంగ్వేజ్‌లో రజినీ సర్ స్టైల్, చిరంజీవి గారు డ్యాన్స్ ఉంటుంది. నా బాడీలోంచి రజినీ గారిని తీసేయడం వాసు గారికి పెద్ద టాస్క్ అయింది. ఎలా చేయాలా? అని అన్నయ్య రజినీకి ఫోన్ చేసి అడిగాను. ఆయన ఇచ్చిన సలహాతోనే కాస్త భయపడుతూ పని చేశాను. మీ అందరికీ నచ్చతుందని ఆశిస్తున్నాను. నిర్మాత సుభాస్కరణ్ గారు దివ్యాంగుల కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చారు. నేను కూడా నా వంతు సాయం చేస్తున్నాను. ఇదంతా నా డబ్బు కాదు. ప్రేక్షకుల డబ్బులే. ప్రేక్షకుల నుంచే డిస్ట్రిబ్యూటర్లు, అక్కడి నుంచి నిర్మాతలు.. నిర్మాతల నుంచి మా వద్దకు వస్తుంది. కంగనా గారితో నటించాలని అందరికీ డ్రీమ్ ఉంటుంది. మహిమ గారు సెట్స్‌లో ఎప్పుడూ పాట పాడుతూనే ఉంటారు. నా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘లైకా నాకు సొంత బ్యానర్‌లాంటిది. చంద్రముఖి 2 సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారికి మేకప్ వేసే పీతాంబరం కొడుకే ఈ పీ వాసు. వారి బ్లెస్సింగ్స్ వాసు గారికి ఎప్పుడూ ఉంటాయి. కీరవాణి గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఆయన సంగీతం ప్రపంచమంతా వింటోంది. కష్టపడితే పైకి రావొచ్చు అనే దానికి రాఘవ లారెన్స్ ఉదాహరణ. సామాన్యమైన వ్యక్తి నుంచి ఇంతటి స్థాయికి ఎదిగారు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కంగనా ఈ చిత్రంలో నటించడం గొప్ప విషయం. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని మేం రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులంతా ఈ సినిమాను చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

పి.వాసు మాట్లాడుతూ.. ‘మాకు ఈ సినిమాను ఇచ్చిన లైకా వారికి థ్యాంక్స్. నా సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా నాన్న పీతాంబరం గారు లేకపోయి ఉంటే మేం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. మా గాడ్ ఫాదర్ ఎన్టీఆర్ గారే మాకు అన్నీ ఇచ్చారు. మొదటి పార్ట్‌కు విద్యా సాగర్ గారు చేశారు. రెండో పార్ట్‌కు కీరవాణి గారు రావడం మా అదృష్టం. విద్యా సాగర్ గారు ఎందుకు లేరు? అని కీరవాణి గారు అడిగారు. అది ఆయన గొప్పదనం. ముందు కీరవాణి గారు విద్యా సాగర్‌కే ఫోన్ చేసి చెప్పారు. చైతన్య గారు అద్భుతంగా పాటలు రాసి ఇచ్చారు. సినిమాకు పని చేసిన నా టీంకు థాంక్స్. కంగనా ఈ సినిమా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. లారెన్స్ మాస్టర్ ఈ సినిమా ఒప్పుకోవడం సంతోషంగా అనిపించింది. గ్రూప్ డ్యాన్స్‌లో చివర్లో ఉన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఆయన కష్టపడే తత్త్వమే ఈ విజయానికి కారణం. మాస్టర్‌ను డైరెక్ట్ చేశాను అని నాకు గర్వంగా ఉంది. సెప్టెంబర్ 28న సినిమా రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఎన్వీ ప్రసాద్ గారు ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ప్రేక్షక దేవుళ్లు మా సినిమాను చూసి విజయవంతం చేయాల’ని అన్నారు.

కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘ఏక్ నిరంజన్ తరువాత నేను తెలుగులో నటించిన చిత్రమిదే. చంద్రముఖి అనే ప్రయాణం నాకు ఎంతో స్పెషల్. నా దర్శకుడు పి వాసు గారికి థాంక్స్. నాకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకు థాంక్స్. మాస్టర్ గారిని మిస్ అవుతాను. నేను ఇంత వరకు ఏ హీరోకు కూడా ఇలా చెప్పలేదు. మళ్లీ ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను. కీరవాణి గారు మా సినిమాకు అతి పెద్ద బలం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎం ఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘చంద్రముఖి 2లో దెయ్యాన్ని చూపించకుండానే అంతలా భయపెట్టారు. మాస్టర్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. కంగనా గారు, లైకాతో మొదటి సారి పని చేశాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను. మొదటి పార్ట్‌లో విద్యా సాగర్ గారు ఓ మార్క్ సెట్ చేశారు. నా శక్తి మేరకు నేను పని చేశాను. నాకు అవకాశం ఇచ్చిన వాసు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

మహిమా నంబియార్ మాట్లాడుతూ.. ‘చంద్రముఖి 2 సినిమా నా కెరీర్‌లో ఎంత ముఖ్యమైంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మాస్టర్‌తో పని చేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధారణంగా సాంగ్స్‌లో హీరోయిన్లను చూస్తారు. కానీ మాస్టర్ ఉంటే మాత్రం ఆయన్నే అందరూ చూస్తారు. కంగనా మేడంతో పని చేయడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 అందరినీ అలరిస్తుంది. అందరూ థియేటర్లో చూసి మమ్మల్ని ప్రోత్సహించండ’ని కోరారు.

లిరిక్ రైటర్ చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ.. ‘చంద్రముఖి సినిమాను ఎన్నో సార్లు చూశాను. అలాంటి సినిమాకు పాటలు రాసే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆరు పాటలు రాసే అవకాశాన్ని కీరవాణి గారు, వాసు గారు, లైకా ప్రొడక్షన్స్ వారు నాకు ఇచ్చారు. తమిళంలో ఐదు పాటలు నాతో రాయించారు. తెలుగులో ఒక పాటను రాశాను. మదన్ కార్కీ, నేను కలిసి ఎన్నో పాటలు రచించాం. ఇప్పుడు తెలుగులో తమిళ వర్షన్‌ను ఆయన రాశారు.. తమిళంలో తెలుగు వర్షన్‌ను నేను రచించాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.