వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా శివ నాగేశ్వరరావు ఓ ఇమేజ్ ఉంది. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. అయితే తాజాగా శివ నాగేశ్వరరావు ‘దోచేవారెవరురా’ పేరుతో ఓ మూవీ రూపొందించారు. ఇటీవల థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 29నుండి ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రతి మనిషి వేరొక మనిషి చేతిలో ఏదో ఒక రకంగా దోపిడీకి గురవుతూనే ఉంటాడు. కొందరు డబ్బుల్ని దోచుకుంటే… మరికొందరు మాన ప్రాణాలను దోచుకుంటారు. ఇంకొందరు మనసుల్ని దోచుకుంటారు. రాజకీయ నాయకులైతే సమాజాన్నే దోచుకుంటారు. అయితే… ఇందులో అలా రకరకాలుగా దోచుకునే పాత్రలు మనకి కనిపిస్తాయి. ఓ అనాధ పిల్లాడికి మేలైన వైద్యం చేయించడం కోసం హీరో దొంగగా మారి డబ్బులు దోచుకుంటాడు. అదే వ్యక్తి హీరోయిన్ కు సాయం చేసి ఆమె మనసు దోచుకోవాలని చూస్తాడు. అలానే తమ్ముడు ప్రేమించిన అమ్మాయిపై మోజు పడి ఓ అన్న ఆమె శీలాన్ని దోచుకుంటాడు. తనను మోసం చేసి పెళ్ళాడిన వాడి ఆస్తిని అతని భార్య దోచుకుంటుంది. ఓ కిరాయి హంతకుడు డబ్బుల కోసం ఇతరుల ప్రాణాలను దోచుకుంటాడు. ఇలాంటి చిత్ర విచిత్రమైన పాత్రలతో సాగే కథే ‘దోచేవారెవరురా’!
ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన వాడు కావడంతో కెమెరా ఫియర్ లేకుండా చక్కగా నటించాడు. మలయాళీ బొద్దుగుమ్మ మాళవిక సతీశన్ కూడా ఇంప్రసివ్ గానే ఉంది. ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలలో తన నట విశ్వరూపం చూపించిన అజయ్ ఘోష్ ఇందులో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు. మూగవాడి సైగలను అర్థం చేసుకోమని ప్రేక్షకులకు పరీక్ష పెట్టకుండా అతని భావాన్ని సబ్ టైటిల్స్ గా వేయడం బాగుంది.
అలానే బిత్తిరి సత్తి కిరాయి హంతకుడి పాత్ర పోషించాడు. ఆ పాత్ర ద్వారా వినోదాన్ని అందించాడు దర్శకుడు. అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి… ఈ ఇద్దరి మీద చెరొకపాట పెట్టడం విశేషం. యూ ట్యూబర్ ప్రణవి సాధనాల అజయ్ ఘోష్ భార్యగా చలాకీగా నటించింది. ఇతర పాత్రలను ‘జెమిని’ సురేశ్, కోట, భరణి, టార్జాన్, బెనర్జీ తదితరులు పోషించారు. అయితే అందరికంటే ప్రధానం చెప్పుకోవాల్సింది మాస్టర్ చక్రి గురించి. చక్కని హావ భావాలతో ఈ బాలనటుడు మెప్పించాడు. కొన్ని చోట్ల కళ్ళలో నీళ్ళూ తెప్పించాడు. ఆర్లీ గణేశ్ ఛాయాగ్రహణాన్ని, రోహిత్ వర్థన్, కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇందులో లిపిలేని భాషలో శివ నాగేశ్వరరావు రాసిన ఓ పాట ఎండ్ టైటిల్స్ లో వస్తుంది.
చిత్రం : దోచేవారెవరురా
నటీనటులు: అజయ్ ఘోష్, చక్రి (చైల్డ్ ఆర్టిస్ట్), బిత్తిరి సత్తి, ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు తదితరులు.
బ్యానర్: ఐక్యూ క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
సంగీతం: రోహిత్ వర్ధన్, కార్తీక్
సినిమాటోగ్రఫీ: ఆర్లి
ఎడిటర్: శివ వై. ప్రసాద్
పి.ఆర్.ఓ: లక్ష్మీ నివాస్