గౌరవనీయులైన ఎడిటర్‌గారికి, నమస్సుమాంజలి.

మీ అనుభవంలో మీరెన్నో గొప్పగొప్ప సంఘటనలు, ఎంతో ఘనమైన సందర్భాలను చూసి ఉంటారు. వాటి గురించి మీ కలం ఎంతో రాసి ఉంటుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా అపురూపమైన సందర్భాలు జరిగినప్పుడు మీరు వాటి పట్ల చూపించే ఆసక్తి, అనురక్తి ఎంతో అభినందనీయమైనవి. అందుకే మీ దృష్టికి మరో అపూర్వమైన కార్యక్రమం గురించిన వివరాలను తీసుకురావాలన్నదే ఈ లేఖ ప్రధాన ఉద్దేశ్యం.

గడచిన ఆర్ధశతాబ్దంలో, ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకుని, మైలురాళ్ళను తనదైన ప్రతిభాపాటవాలతో సృష్టించి, తెలుగు సినిమా చరిత్రలోనే తనవైన సరికొత్త అధ్యాయాలను రాసుకుని, కోటానుకోట్ల అభిమానుల గుండెలలో గుడికట్టుకున్న ఒక మహా కథానాయకుడు…కమర్షియల్‌ చిత్రానికి సంచలన నిర్వచనాలను చెప్పిన ఒక నిరుపమాన కథానాయకుడు….బాక్సాఫీసు ఎన్నడూ ఊహించని వసూళ్ళ పెనుతుఫానులను ప్రేరేపించిన ఒక అగ్రకథానాయకుడు…మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజాచిత్రం భోళాశంకర్‌ ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్న శుభసందర్భంలో ఒక అద్భుతమైన ఘట్టానికి తెరతీయబోతున్నామని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం.

ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ప్రపంచసినిమాలో ఏ కథానాయకుడికి జరిగిన దాఖలాలు లేని విధంగా, మెగాస్టార్‌ చిరంజీవి అసంఖ్యాక అభిమానులు పాల్టొని, మన భాగ్యనగర వీధులలో దాదాపు 600 కిలోమీటర్ల మేరకు జిపిఎస్‌ ట్రాకింగ్‌ సంవిధానంతో మెగాస్టార్‌ ముఖకవళికలే దారులుగా ఒక భారీ ర్యాలీ రేపటిరోజున జరుగబోతోంది. సవినయంగా మనవి చేసుకునే విషయం ఒకటుంది. ఈ కార్యక్రమం కేవలం భోళాశంకర్‌ ప్రచారం నిమిత్తం చేస్తున్నది కాదని చెప్పాలన్నది మా ప్రయత్నం. విడుదల తేదీ ఎల్లుండి అంటే ఆగస్టు 11వ తేదీన కాబట్టి రేపటి రోజున జరుగబోతున్న ఈ భారీ ర్యాలీ అందుకేనేమో అనే ఆలోచన సహజంగా కలుగుతుంది. కానీ అది కేవలం యాధృచ్ఛికం. కానీ, ఆ మహా చిత్రకథానాయకుడి అంతులేని,అలుపులేని చిరకీర్తిని, స్థిరఖ్యాతిని పురస్కరించుకుని ఆయన అభిమానగణం పూనుకున్న ఆత్మీయమైన పండగ ఇది అని చెప్పాలని ఉవ్విళ్ళూరుతున్నాం. ఇందులో ఆయనతో నటించిన, ఆయన చిత్రాలకు పనిచేసిన, నటీనటులు, సాంకేతికనిపుణులు మెగాస్టార్‌ పట్ల వారివారికున్న అభిమానం, అనుబంధాన్ని నెమరువేసుకుంటూ పంపించే వీడియో మెసేజ్‌లు ఈ కార్యక్రమానికి, బంగారానికి తావి అబ్బినట్టు వన్నెతెస్తాయని చెప్పాలి. ఎందరి కృషి ఫలితంగానో రూపుదిద్దుకున్న కార్యక్రమ ప్రణాళిక, ఆచరణలు మీ అభినందనలు, మన:పూర్వక ప్రశంసలను పొందుతుందని ఆశ. గురువారం ఉదయం 8 గంటలకు ప్రపంచ ప్రఖ్యాతమైన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఈ మహా సంబరం ప్రారంభం అవుతుంది.

తప్పకుండా మీరు మా ప్రయత్నానికి వెన్నుకాసి, వలసిన రీతిలో, ఆ మహకథానాయకుడి జీవనగమనాన్ని ప్రతిబింబిస్తూ జరిగే ఈ ర్యాలీ విశేషాలను, ముచ్చట్లను మీ మాధ్యమం ద్వారా పాఠకలోకానికి సమర్పిస్తారని భావిస్తూ- ఇతోధికంగా మమ్మల్ని, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి, మమ్మల్ని దీవిస్తారని ఆశిస్తున్నాం. గౌరవవందనాలతో….

#GPSthoBholaaShankar LIVE |  Chiranjeevi | Meher Ramesh | BholaaShankar | AUGUST 11th Release