మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు

‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కథానాయకుడు మహేష్ బాబు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆయన ఐడియానే. మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని చర్చించుకుంటుంటే ఆయన మీ ఊరిలో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు. దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేయండని అన్నాను. ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు స్నేహితుడు కంటే ఎక్కువ. నా కుటుంబ సభ్యుడిలాగా. నేను ఆయన గురించి బయట ఎప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడతాం. కానీ ఈ గత రెండు సంవత్సరాలు ఆయన నాకిచ్చిన సపోర్ట్, స్ట్రెంత్ నేనెప్పుడూ మర్చిపోలేను. థాంక్యూ సార్. మీకు థాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా మాట్లాడుకోము. ఆయన సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా పర్ఫామెన్స్ లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది నాకు తెలియదు. అతడు నుంచి మా ప్రయాణం మొదలైంది. ఖలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరుకారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. నేనెప్పుడూ ఇలా చెప్పలేదు. ఇవి మనసులోనుంచి వచ్చే మాటలు. అభిమానుల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. లవ్ యు సార్. మా నిర్మాత చినబాబు గారు.. ఇది నాకు ఆయన చెప్పలేదు కానీ నాకు తెలుసు. ఆయన బాగా ఇష్టపడే హీరోని నేనే. మానిటర్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్ లో సీన్స్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందమేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. థాంక్యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు, డైరెక్టర్ గారికి తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేశారో. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీలీల గురించి చెప్పాలంటే.. చాలారోజుల తర్వాత ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉంది. హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరు. ఆమె షాట్ చిత్రీకరణ లేకపోయినా అక్కడే ఉంటుంది. మేకప్ వ్యాప్ లోకి వెళ్ళదు. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం.. వామ్మో(నవ్వుతూ).. అదేం డ్యాన్స్. హీరోలు అందరికీ తాట ఊడిపోయిద్ది. శ్రీలీలకి అద్భుతమైన భవిష్యత్ ఉంది. మీనాక్షి మా సినిమాలో ప్రత్యేక పాత్ర చేసింది. నేను, త్రివిక్రమ్ గారు అడగగానే అసలేం ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించింది. ఆ విషయంలో ఎలా థాంక్స్ చెప్పాలో అర్థంకావట్లేదు. ఆ పాత్రకు నిండుతనం తీసుకొచ్చింది. అలాగే థమన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు సోదరుడిలాగా. అతను ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తాడు. ఈ సినిమాలో ఆ కుర్చీ మడతపెట్టి చేస్తావా అని నేను, త్రివిక్రమ్ గారు అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడు. వేరే ఏ సంగీత దర్శకుడైనా పది డిస్కషన్ లు పెట్టేవాడు. థమన్ అలా చేయలేదు. రేపు ఆ పాట మీరు చూడండి.. థియేటర్లు బద్దలైపోతాయి. థాంక్యూ థమన్. పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతి ఏడాది అది పెరుగుతూనే ఉంది. చేతులెత్తి దణ్ణం పెట్టడం తప్ప ఏం చేయాలో తెలీదు. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. నాకు, నాన్నగారికి సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగ కొడతాం. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు.. అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి చెప్తుంటే ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఈ సినిమాలు, ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇకనుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ. ఈ ఫంక్షన్ జరగడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీస్ వారికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అన్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈరోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం. రమణగాడు మీ వాడు, మనందరి వాడు. అందుకని మీ అందరి మధ్యలో ఈ ఫంక్షన్ చేయాలని అనుకున్నాం. చాలారోజుల షూటింగ్ తర్వాత విపరీతంగా అలిసిపోయి కూడా మీ అందరినీ కలవడం కోసం గుంటూరుకి వచ్చారు. రెండో కారణం.. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప మహానటుడు, ఒక గొప్ప మనిషి. ఆయనతో నేను సినిమా చేయలేదు కానీ, ఆయన నటించిన ఒక సినిమాకి పోసాని గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాను. ఆయనతో డైరెక్ట్ గా పరిచయం కలిగినటువంటి సందర్భం అదొక్కటి మాత్రమే. ఆ తరువాత నేను అతడు, ఖలేజా సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడటం, ఆయనతో గడిపిన ప్రతిక్షణం కూడా నాకు చాలా చాలా అపూర్వమైనది, అమూల్యమైనది. అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ గారు ఇంకెంత అదృష్టవంతుడు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్క సినిమాకి వంద శాతం పని చేయాలంటే రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ గారు. ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా వెనక్కి తిరిగి చూడరు. నేను అతడు సినిమాకి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో, ఖలేజాకి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. పాతిక సంవత్సరాలైంది అంటున్నారు కానీ, నాకు మాత్రం నిన్న మొన్న పరిచయమైన హీరోలాగే కనిపిస్తున్నారు. చూడటానికి అంత యంగ్ గా ఉన్నారు. మనసులోనూ అంతే యంగ్ గా ఉన్నారు. పర్ఫామెన్స్ లో కూడా అంత నూతనంగా, అంత యవ్వనంగానే ఉన్నారు. ఆయనకు మరిన్ని వసంతాలు ఉండాలని, కృష్ణ గారి తరపున మీరందరూ ఆయన వెనక ఉండాలని, ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 12 న థియేటర్లలో కలుద్దాం. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం. ఆనందంగా జరుపుకుందాం. రమణగాడితో కలిసి జరుపుకుందాం.” అన్నారు.

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ గారికి కృతఙ్ఞతలు. ఎన్ని పుస్తకాలు చదివితేనో, ఎంతో అనుభవాలు ఉంటేనో గానీ అంత జ్ఞానం రాదు. మీరు అలా ఒక్క ముక్కలో, ఒక్క మాటలో, ఒక్క పాటలో అలా ధారపోస్తారు. రాఘవేంద్రరావు గారి సినిమా తర్వాత ఇది మళ్ళీ నాకు రీలాంచ్ లా అనిపిస్తుంది. నాకు అమ్ము పాత్ర ఇచ్చినందుకు, నన్ను గైడ్ చేసినందుకు, సెట్ లో నా టార్చర్ భరించినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. మహేష్ బాబు గారిని చూస్తూ నేను డైలాగ్ లు కూడా మర్చిపోయేదాన్ని. నా పట్ల అంత ఓపిక ఉన్నందుకు థాంక్యూ సార్. మహేష్ బాబు గారు ఎలా ఉంటారంటే.. ఒక బంగారపు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఆయనే కాదు, ఆయన మనసు కూడా అందమైనది. ఎక్కడో ప్రేక్షకుల మధ్యలో ఉండి చూడాల్సిన దానిని, దేవుడి దయ వల్ల ఇక్కడున్నాను అనుకుంటున్నాను. మీనాక్షి నాకు సోదరి లాంటిది. మా నిర్మాతలు కుటుంబసభ్యుల్లా అనిపిస్తారు. నా మొదటి అడుగు నుంచి నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. మీకోసం గుంటూరు కారంతో వస్తున్నాను. ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ.. నేను మీ అమ్ము.. మీకోసం థియేటర్లలో ఎదురుచూస్తూ ఉంటాను.” అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా త్రివిక్రమ్ గారికి చాలా చాలా థాంక్స్. ఆయనతో కలిసి పని చేయాలనే కల నెరవేరింది. ఈ సినిమా వల్ల త్రివిక్రమ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనను అందరూ గురూజీ అని ఎందుకు పిలుస్తుంటారో నాకు అర్థమైంది. ప్రతిష్టాత్మక బ్యానర్ లో రూపొందిన ఈ ప్రాజెక్ట్ లో నన్ను భాగం చేసినందుకు వంశీ గారికి, చినబాబు గారికి ధన్యవాదాలు. డ్యాన్సింగ్ స్టార్ శ్రీలీల సెట్స్ లో ఎంతో ఎనర్జీ తీసుకొచ్చింది. తనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. మహేష్ బాబు గారి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాల్ వచ్చినప్పుడు మొదట షాక్ లో ఉన్నాను. మొదటి రోజు అంత పెద్ద స్టార్ తో కలిసి పని చేయడం కాస్త నెర్వస్ గా అనిపించింది. కానీ మహేష్ గారు ఆ నెర్వస్ పోగొట్టి కంఫర్టబుల్ గా ఉండేలా చేశారు. ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో మహేష్ గారు ఒకరు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ గారి మాస్ ఫిల్మ్ జనవరి 12న వస్తుంది. థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. గుంటూరు వైబ్స్ మామూలుగా లేవు. అప్పుడే సంక్రాంతికి సినిమా విడుదలైన వైబ్స్ కనిపిస్తున్నాయి. ముందుగా మా మిత్రుడు, నిర్మాత చినబాబు గారికి థాంక్యూ వెరీ మచ్. చినబాబు గారు ప్రతి సినిమాని ఎంతో శ్రద్ధగా తీస్తూ, విజయాలు సాధిస్తున్నారు. అలాగే చినబాబు గారికి వంశీ తోడుగా ఉంటూ.. హారిక అండ్ హాసిని, సితార బ్యానర్లపై మంచి సినిమాలు అందిస్తున్నారు. నిర్మాతలుగా రాణించడం అంత తేలిక లేదు. ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ వారిద్దరి ప్రయాణం అద్భుతంగా ఉంది. వారికి తోడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు. ఆ బ్యానర్ల నుంచి వచ్చే సినిమాల విజయం వెనుక త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. ఎన్నో మంచి సినిమాలు అందిస్తున్న మీ అందరికీ కృతఙ్ఞతలు. థమన్ సంగీతంతో అదరగొడుతున్నాడు. ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు మహేష్ గారు, శ్రీలీల వేసే డ్యాన్స్ లకు థియేటర్లలో స్క్రీన్ లు చిరిగిపోతాయి. త్రివిక్రమ్ గారు నాకు కొన్ని సన్నివేశాలు చూపించారు. పాటలు మాత్రమే కాదు.. నేపథ్య సంగీతం కూడా థమన్ మామూలుగా ఇవ్వలేదు. థియేటర్లకు వెళ్ళేటప్పుడు పేపర్లు ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఆ సన్నివేశాలకు పేపర్లు సరిపోవు. శ్రీలీల ఎనర్జీ గురించి మీ అందరికీ తెలిసిందే. నేను కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూశాను. మామూలుగా లేదు. త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాతో ఏదో మాయ చేస్తారు. మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి, హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. త్రివిక్రమ్ గారు అద్భుతమైన సినిమా తీస్తున్నారు. మహేష్ బాబు గారు ఈ సినిమాతో కలెక్షన్ల తాట తీస్తాడు. త్రివిక్రమ్ గారు హీరో క్యారెక్టర్ ని రాసిన విధానం బాగుంది. పోకిరి, దూకుడు వంటి సినిమాల తరహాలో మహేష్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ గారు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు. సిద్ధంగా ఉండండి. ఈ సంక్రాంతి మహేష్ గారి అభిమానులకు చాలా పెద్ద పండగ. ఈ మధ్య ప్రతి సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ ఇరగదీస్తున్నారు మహేష్ గారు. అది మీకోసమే. ఈ సినిమాలో కుర్చీ పాట మిమ్మల్ని బాగా అలరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను ఈ గుంటూరు కారం కట్టిపడేస్తుంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ వస్తుంది. రెడీగా ఉండండి.” అన్నారు.

నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ(చినబాబు), ఎస్. నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్న ఈ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కేరింతల మధ్య అత్యంత ఘనంగా జరిగింది.