‘హాయ్ నాన్న’ టీంని అభినందించిన అల్లు అర్జున్ – ధన్యవాదాలు తెలిపిన నాని

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ అన్ని వైపుల నుంచి ప్రశంసలను పొందుతోంది. ఇటువంటి అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో వచ్చినందుకు చాలా మంది ప్రముఖులు నాని, టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. అల్లు అర్జున్ ‘హాయ్ నాన్న’ టీమ్ మొత్తానికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ రాశారు.

“హాయ్ నాన్న మొత్తం టీమ్‌కి అభినందనలు. ఎంతో మధురమైన చిత్రమిది. నిజంగా మనసుని హత్తుకుంది. బ్రదర్ నాని గారు అద్భుతమైన నటన కనపరిచారు. ఇటివంటి మంచి కథను చేసినందుకు చాలా గౌరవంగా వుంది. డియర్ మృణాల్. మీ స్వీట్ నెస్ తెరపై వెంటాడుతోంది. మీలాగే అందంగా ఉంది. బేబీకియారా !మై డార్లింగ్.. నీ క్యూట్‌నెస్‌తో మనసుని ఆకట్టుకున్నావ్. చాలు..ఇక స్కూల్ కి వెళ్ళు 😂😘 మిగతా ఆర్టిస్ట్‌లందరికీ వారి చక్కని నటనకు & సాంకేతిక నిపుణులకు అభినందనలు. ముఖ్యంగా కెమెరామెన్ @SJVarughese & సంగీత దర్శకుడు @HeshamAWMusic అద్భుతమైన పనితీరు కనపరిచారు. దర్శకుడు @శౌర్యువ్ గారు.. అభినందనలు ! మీరు మీ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు. మనసులని హత్తుకునే & కన్నీళ్ళు తెప్పించే మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. .అద్భుతమైన ప్రెజెంటేషన్. ఇలాంటి స్వీట్ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు. #HiNanna కేవలం తండ్రులనే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుల మనసులని హత్తుకుంటుంది” అని అభినందించారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ మాటలను నిజం చేస్తూ, హృదయాన్ని కదిలించే కాన్సెప్ట్, అసాధారణమైన పెర్ఫార్మెన్స్, అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలన్న ‘హాయ్ నాన్న’ను ప్రతి కుటుంబ సభ్యులు ఇష్టపడుతున్నారు.

‘హాయ్ నాన్న’ను ప్రోత్సహించినందుకు అల్లు అర్జున్ కు ధన్యవాదాలు తెలిపారు నాని. “అర్హ నాన్న ఆమోదించారు:)’థాంక్ యూ సో మచ్ డియర్ బన్నీ. మంచి సినిమా కోసం నువ్వు ఎప్పుడూ ఉంటావు♥ #HiNanna” అని నాని బదులిచ్చారు.

ఈ సినిమా ప్రమోషన్ కోసం నాని ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్న సంగతి తెలిసిందే, ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

హాయ్ నాన్న మ్యజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన నేపధ్యంలో యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

సక్సెస్ ప్రెస్ మీట్ లో దర్శకుడు శౌర్యువ్ మాట్లాడుతూ.. హాయ్ నాన్నకి అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా వుంది. ‘మీరు మరో సినిమా చేస్తే అది మొదటి రోజు వందకోట్లు కొడుతుందో లేదో చెప్పలేం కానీ మీరు ఇంకో పది సినిమాలు చేసినా హాయ్ నాన్నకి వచ్చినంత గౌరవం రాదు’’అని సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న అభినందనలు వింటున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. గురువారం వర్కింగ్ డే ఈ సినిమా రిలీజ్ చేశాం. ఐతే రిలీజ్ కి ముందే నాని గారు ఈ సినిమా రోజురోజు పెరుగుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. రోజుకు మించి రోజు రెస్పాన్స్ పెరుగుతూ వెళుతోంది. అల్లు అర్జున్ గారికి కృతజ్ఞతలు. అలాగే సుస్మిత గారికి, కార్తికేయ, వెంకటేష్ మహా, కిచ్చా సుదీప్..ఈ సినిమాని అభినందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. హాయ్ నాన్నని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు.

నిర్మాత విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ.. హాయ్ నాన్న మా బ్యానర్ లో మొదటి చిత్రం. మేము ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. హాయ్ నాన్న ని ఫ్యామిలీ అంతా కలసి వచ్చి ఆనందంగా చూస్తున్నారు. చాలా ఆస్వాదిస్తున్నారు. ఇంత మంచి క్లీన్ ఎంటర్ టైనర్ తీశామనే తృప్తి ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాని గారికి, ఇంత మంచి కథ ఇచ్చి అద్భుతంగా దర్శకత్వం వహించిన శౌర్యువ్ కి, మృణాల్, టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. హెషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారికి, కిచ్చా సుదీప్ గారికి ధన్యవాదాలు. సమంత గారు పిల్లలందరిని తీసుకొచ్చి ఈ సినిమా చూశారు. వారికి ధన్యవాదాలు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.

హాయ్ నాన్న తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం 4 రోజుల్లో 40 కోట్ల గ్రాస్‌తో సాలిడ్ నోట్‌తో ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.