ఓడి గెలవడమంటే ఇదేనేమో.! ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో సత్తా చాటుతుందని అంతా అనుకున్నారు. ఏమో, పంజాబ్ ఎన్నికల్లో జరిగినట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ అద్భుతం చేయబోతోందని రాజకీయ విశ్లేషకులూ అంచనా వేశారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోయింది.
అయితేనేం, ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించిందట. జాతీయ పార్టీ హోదా తమకు దక్కడమే ఆ రికార్డు అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. ‘ఐదు సీట్లు గెలవడమంటే చిన్న విషయం కాదు. ఈ సంఖ్యతో మేం ముందు ముందు మరిన్ని అద్భుతాలు చేయబోతున్నాం’ అని చెప్పారు కేజ్రీవాల్.
‘ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కింది. చాలా తక్కువ పార్టీలకు మాత్రమే దేశంలో ఇప్పుడు జాతీయ హోదా వుంది. ఆ పార్టీల సరసన మేం చేరాం. 12 శాతానికి పైగా ఓటు బ్యాంకు సాధించాం. అంతమంది మనసుల్ని గెలుచుకున్న మేం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం..’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
అంతే కాదు, గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఉచిత హామీలు గుప్పించింది. కానీ, ఓటర్లు ఆ ఉచిత పథకాల పట్ల ఆకర్షితులు కాలేదు. ఇదిలా వుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తాము ఊహించినట్లుగానే బీజేపీ కోసం పనిచేసిందనీ, ఆ పార్టీ వల్లనే బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.