Waqf Act: వక్ఫ్ బోర్డు చట్టం: చరిత్ర, వివాదాలు, తాజా మార్పులు ఒకసారి చూద్దాం

వక్ఫ్ బోర్డు పేరు వినగానే చాలా మందికి సందేహాలు, చర్చలు, రాజకీయాలు గుర్తొస్తున్నాయి. ఇది ఎందుకు ఈ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది? అసలు వక్ఫ్ బోర్డు అనేది ఏంటి? ఎప్పుడు మొదలైందీ? ఇప్పుడున్న వివాదానికి అసలు కారణం ఏంటి? అనే అంశాలపై ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం.

వక్ఫ్ అనే పదం అర్థం ‘దైవ సేవకు సమర్పణ’ అని. పూర్వం ధనికులు లేదా రాజులు మసీదులు, పేదల సహాయం కోసం భూములను దానం చేసేవారు. దానిపై ఎవరూ హక్కు చెప్పరాదు. ఈ భూముల నిర్వహణ కోసం ఏర్పడిన సంస్థే వక్ఫ్ బోర్డు. మొట్టమొదటిగా 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ రెండు గ్రామాలను మసీదు కోసం దానం చేయడంతో వక్ఫ్ కాన్సెప్ట్ ప్రారంభమైంది. తరువాత మొఘలులు, బ్రిటిష్ కాలంలో 1913లో వక్ఫ్ బోర్డు అధికారికంగా ఏర్పడింది.

భారత స్వాతంత్రం తర్వాత 1954లో కేంద్రం వక్ఫ్ చట్టాన్ని తీసుకురాగా, 1995లో మెరుగులు చాపడం జరిగింది. 2013లో కబ్జాలను అడ్డుకునేలా మార్పులు చేశారు. అయితే 2025లో తెచ్చిన తాజా సవరణ బిల్లే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ బిల్లులో నాన్ ముస్లిం సభ్యులను బోర్డులో చేర్చడం, కలెక్టర్‌కు అధికాధికారాలు ఇవ్వడం, ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించడంపై ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముస్లింల స్వతంత్రత్వాన్ని దెబ్బతీస్తుందంటూ రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి.

ప్రస్తుతం దేశంలో వక్ఫ్ బోర్డుకు 8.7 లక్షల ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లుగా అంచనా. కానీ వీటిపై అనేక చోట్ల కబ్జాలు, కుంభకోణాల ఆరోపణలున్నాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలలో వివాదాలు చెలరేగాయి. ప్రభుత్వ వాదన ప్రకారం కొత్త బిల్లుతో పారదర్శకత వస్తుందని చెబుతోంది. ముస్లిం మైనారిటీల హక్కులు తొక్కుతున్నారన్నది కాంగ్రెస్, ఐయుడీఎంఎల్ వంటి పార్టీల ఆరోపణ.

మొత్తానికి వక్ఫ్ చట్టం చుట్టూ చర్చలు పెరిగాయి. ఈ చట్టం వల్ల ముస్లింలకు ప్రయోజనం ఉంటుందా? లేక హక్కులు తగ్గిపోతాయా? అన్నది ప్రజల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే, ఈ విషయాన్ని రాజకీయ కళ్లతో కాకుండా, సామాజిక దృష్టికోణంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే… వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, రక్షణ ప్రక్రియ చాలా మందికి తెలియకుండానే జరుగుతోంది. చాలా ప్రాంతాల్లో ప్రజలకు సమాచారం లేకుండా భూములు వక్ఫ్ ఆస్తులుగా నమోదవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని హిందూ దేవాలయాలు, గ్రామాల భూములు కూడా వక్ఫ్ పేరుతో నమోదై ఉండడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలు సందర్భాల్లో ప్రజలు తమ భూములు తమ పేరుపై ఉండాయని నమ్మినా, వాస్తవంగా అవి వక్ఫ్ బోర్డు దినవని తర్వాతే తెలిసింది. ఈ పరిస్థితి వల్ల సామాజికంగా పెద్ద సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇక రాజకీయంగా చూస్తే, వక్ఫ్ బిల్లుపై బీజేపీ మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాదన ప్రకారం ఈ బిల్లు మైనారిటీల హక్కుల్ని హరించే విధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని చెబుతోంది. ఇక బీజేపీ వాదన మాత్రం స్పష్టంగా ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత రావాలి, అక్రమ కబ్జాలను అడ్డుకోవాలి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు రావాలని. ఒకవేళ ఈ బిల్లు పూర్తిగా చట్టంగా మారితే, దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పెద్ద మార్పు జరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ మార్పులు ముస్లిం సమాజానికి ఎంతవరకు స్వాగతయోగ్యమవుతాయన్నది తేలాల్సిన విషయమే.