ఎలుకలు… నిల్వ ఉన్న కోటరు సీసాలలో మందు తాగాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి లీటర్ల మందు తాగాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు ఈ సంఘటన అందరిలో చర్చనీయాంశమయ్యింది. ఇంతకీ అసలు వివరాలు ఏంటంటే…
ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం భారీ ఎత్తున మద్యం దొరికింది. దానిని పోలీసులు సీజ్ చేసి గోదాముల్లో దాచారు. ఇటివల గోదాముల్లోకి పోయిన ఓ కుక్క చనిపోయింది. గోదాముల్లో నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది ఆ గోదాం తాళాలు తెరిచి చూశారు. అంతే అక్కడ వారికి మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. వారు నిల్వ ఉంచిన మందు సీసాలన్ని కూడా రంధ్రాలు పడి ఉన్నాయి. చుట్టూ ఎలుకలు అటూ ఇటు తిరుగుతూ వారికి కనిపించాయి. వారు నిల్వ ఉంచిన మద్యంలో దాదాపు 1000 లీటర్ల మద్యం ఎలుకలు తాగినట్టు గుర్తించారు. మొత్తం వెయ్యి లీటర్ల మద్యాన్ని ఎలుకల గుంపు తాగేసిందని ఎస్పీ అభినందన్ సింగ్ తెలిపారు.
ఆ ఎలుకల గ్యాంగ్‌ను తప్పకుండా పట్టుకుంటామని, భవిష్యత్తులో అవి స్టోర్ రూములోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఘటనపై విచారణకు ఆదేశించనున్నట్టు తెలిపారు. విచిత్రం ఏమిటంటే.. సీజ్ చేసిన మద్యాన్ని నమూనాలు, చట్టపరమైన ప్రొసీడింగ్స్ కోసం కొంత మొత్తంలో సేకరించి మిగతా దానిని ధ్వంసం చేయాలి. అలా కాకుండా మొత్తం క్యాన్ల కొద్దీ దొరికిన మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో దాచడం, తర్వాత దానిని ‘ఎలుకలు’ తాగేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని పై విచారణ చేసి సిబ్బంది తప్పు ఉంటే వారి పై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఎలుకలు ఇలా మద్యం తాగాయని పేర్కొనడం ఇదే మొదటి సారి కాదు. గతంలో బిహార్‌లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కూడా ఎలుకలే తాగాయని పోలీసులు పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో 2017లో స్వాధీనం చేసుకున్న 45 కేజీల మాదక ద్రవ్యాలనూ తినేశాయని పోలీసులు ఎలుకలపై ఆరోపణలు చేశారు. గతేడాది బిహార్‌లో వరదలకు కూడా ఎలుకలే కారణమని రాష్ట్ర మంత్రి రాజీవ్ రంజన్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు.