భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తత, విమాన సర్వీసులు బంద్

భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త త పెరుగుతూ ఉంది.

దీనితో భారత్-పాకిస్తాన్ ల మధ్య గగన తలాన్ని వినియోగించుకునే అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. కొన్ని విమనాలు గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం లేకపోవడంతో వెనుదిరిగి పోతున్నాయి మీడియాలో వార్తలొస్తున్నాయి.

అమృత్ సర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. పాకిస్తాన్ దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. లాహోర్ , ముల్తాన్,ఫైసలాబాద్, సియల్ కోట్, ఇస్లామాబాద్ నుంచి సర్వీసులను నిలిపివేశారు.

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎల్ వొసి ని దాటి కాల్పులు జరపడం మొదలు పెట్టిందని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘ మా శక్తి సామర్థ్యాలను, హక్కును, ఆత్మరక్షణ సామర్థ్యాన్నిప్రదర్శించేందుకే ఈ కాల్పులని పాక్ పేర్కొంది. ఇపుడున్న ఉద్రిక్తతను విషమింప చేసే ఉద్దేశం మాకు లేదు, అయితే, అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేశాం,’ అని పాక్ పేర్కొంది.

పాకిస్తాన్ కు చెందిన ఒక F16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు, దాంట్లోంచి ఒక పారాష్యూట్ కిందికి దిగినట్లు భారత వర్గాలు చెబుతున్నాయి.పోతే, తాము రెండు జెట్లను కూల్చేశామని, ఒక పైలట్ ను సజీవంగా పట్టుకున్నామని పాకిస్తాన్ చెబుతూ ఉంది.

అయితే, కాశ్మీర్ లోని బద్గామ్ జిల్లాలో ఒక జెట్ కూలిపోయాక భారత ప్రభుత్వం కూడా అయిదు విమానాశ్రయాలలో పౌర విమాన సర్వీసులను నిలిపివేసింది.ఈ విమానాశ్రయాలు చండీగడ్, అమృతసర్, శ్రీనగర్, లే , జమ్ము.