Stock Market: లాభాలతో మళ్లీ పుంజుకున్న మార్కెట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు లాభాల్లో ముగిసాయి. ప్రధానంగా మెటల్, టెక్నాలజీ, రియల్టీ రంగాల్లో కొనుగోళ్ల జోరు మార్కెట్‌కి ఊపునిచ్చింది. గత కొన్ని సెషన్లుగా ఒడిదొడుకులకు లోనవుతున్న సూచీలు, ఈరోజు స్థిరంగా లాభాల్లో ముగియడం విశేషం. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్టర్ల ఆసక్తి బాగా పెరగడం ద్వారా మార్కెట్ లో పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు పెరిగి 81,330 వద్ద నిలిచింది. నిఫ్టీ 88 పాయింట్లు లాభంతో 24,666 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, మారుతీ షేర్లు మంచి లాభాలు నమోదు చేశాయి. మరోవైపు, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

మరో ముఖ్య అంశం ఏంటంటే, ఏప్రిల్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6 ఏళ్ల కనిష్ఠానికి చేరుకోవడమే. ఆహార ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్ మానసిక పరిస్థితి మెరుగయ్యింది. దీనికి తోడు అమెరికాలో ద్రవ్యోల్బణ తగ్గుతుండటం, ఫెడ్ వైఖరి సానుకూలంగా మారవచ్చన్న అంచనాలు గ్లోబల్ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.

వడ్డీ రేట్లలో మార్పు వచ్చే అవకాశంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్ బలహీనత దేశీయ కరెన్సీకి మద్దతు ఇచ్చాయి. దీంతో నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.13%, స్మాల్‌క్యాప్ 1.36% పెరగడం ద్వారా చిన్న షేర్లలో పెట్టుబడులు మళ్లీ పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. సమగ్రంగా చూస్తే, ప్రస్తుతం మార్కెట్‌కు అనుకూలంగా పలు ఇండికేటర్లు కనిపిస్తున్నప్పటికీ, సుదీర్ఘ లాభాలకు తగిన ఆర్థిక ప్రేరణలు అవసరమని నిపుణుల అభిప్రాయం.