బీజేపీ రాజ్‌నాథ్‌సింగ్‌ ఏపీకి సంచలన ప్రకటన

కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం గుంటూరులో పర్యటించారు. మంగళగిరిలో నిర్మాణం కానున్న బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, చంద్రబాబులపై విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నాం అంటూ సంచలన ప్రకటన చేశారు. దీనిపై మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చదవండి.

మంగళగిరిలో నిర్మితమవనున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గుంటూరు నుండే రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అన్నారు. పూర్తి మెజార్టీతో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే అని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించింది అని గుర్తు చేశారు.

ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ ను చంద్రబాబు బ్రతికించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకున్న వారెవరూ బయటపడలేరు అని స్పష్టం చేశారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు యుటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఎన్డీయేను చంద్రబాబు ఎందుకు విడిచి పెట్టారో ఇప్పటికి నాకు తెలియదు అన్నారు రాజ్‌నాథ్‌.

విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇస్తున్నాం అని తెలియజేసారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీనే కాదు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అన్నారు. విజయవాడ అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు చేసాం అని పేర్కొన్నారు. తెలంగాణకు నాలుగు బెటాలియన్లు ఇస్తే ఏపీకి ఎనిమిది ఇచ్చాం అన్నారు. అన్నీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి వాళ్ళే సిద్ధంగా లేరన్నారు.