భారత్ లో లోక్ సభ ఎన్నికలకు ముందు పాక్ తో యుద్ధం జరుగుతుందని బిజెపి తనకు రెండేళ్ల కిందటే చెప్పినట్టు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రముఖ మీడియా సంస్థ “డాన్” తన వెబ్ సైట్ లో పేర్కొంది. భారత్ కు చెందిన ఓ ఇంగ్లీషు వెబ్ సైట్ లో వచ్చిన కథనాన్ని లింక్ చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేసింది.
“యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు. దీన్ని బట్టి మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్నది అర్ధం చేసుకోవచ్చు” అని పవన్ అన్నట్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలను కడప జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పవన్ మాట్లాడినట్టు డాన్ లింక్ చేసిన భారత వెబ్ సైట్ పేర్కొంది. దేశ భక్తి కేవలం బిజెపికే లేదని మిగిలిన వారికి వారికంటే 10 రెట్లు ఎక్కువ ఉందని పవన్ అన్నట్టు పేర్కొంది.
భారత్‌లోని ముస్లింలు వారి దేశభక్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సమాజంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు జరిగే ప్రయత్నాలను విఫలం చెయ్యాల్సిందిగా జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చినట్లు ఈ కథనం తెలిపింది.