ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అనే పాట గుర్తొస్తోంది ఈ ఘటన చూస్తే. ఆయన ఐఏఎస్. పెద్ద హోదా. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నాడు. కానీ.. ఒక చిన్న ఘటన వల్ల తన ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. అది కూడా సొంత భార్యను కొట్టి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. విచిత్రంగా ఉంది కదా.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్నది.
ఏడీజీగా పనిచేస్తున్న పురుషోత్తం శర్మ.. తన భార్యను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలు కాస్త ముఖ్యమంత్రి, హోంమంత్రి దాకా వెళ్లడంతో.. ఆయన్ను విధుల నుంచి వెంటనే తప్పించారు.
అంతే కాదు.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. పురుషోత్తానికి ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రి కూడా ఈ ఘటనపై స్పందించి.. కేసు విచారణలో ఉందని.. ప్రస్తుతం ఆ ఆఫీసర్ ను సస్పెండ్ చేశామని చెప్పారు.
అయితే.. ఈ ఘటనపై స్పందించిన పురుషోత్తం.. తానేమీ నేరం చేయలేదని… అది తమ కుటుంబ గొడవ మాత్రమేనన్నారు. మాకు 32 ఏళ్ల క్రితం వివాహం అయింది. 2008లో నా భార్య నాపై ఫిర్యాదు చేసింది. తను నాపై ఫిర్యాదు చేసినా నాతోనే ఉంది. నా ఇంట్లోనే ఉన్నది. తనను నేను బంగారంలా చూసుకున్నా. అన్నీ నా ఖర్చులే. అన్ని సౌకర్యాలను అనుభవించింది. లగ్జరీగా బతికింది. మా ఇంట్లో ఏవో చిన్న గొడవలు. నిజంగా నేను మంచివాడిని కాకపోయి ఉంటే.. నాతో ఇన్ని రోజులు ఎలా ఉండేది. నేను ఓ సమస్యలో చిక్కుకున్నా. కావాలని నా భార్య ఇంట్లో కెమెరాలు పెట్టించి నా పరువును బజారుకీడ్చింది.. అంటూ పురుషోత్తం మీడియా ముందు వాపోయారు.
https://www.youtube.com/watch?v=5fN1KyRqGMU&feature=emb_title