Foreign Cars Scam: లగ్జరీ కార్ల వెనుక ‘నకిలీ’ డ్రైవ్‌: హైదరాబాద్ లో 100 కోట్ల స్కాం!

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల డీలర్ బషరత్ ఖాన్‌ ఇప్పుడు కస్టమ్స్ అధికారుల మెరుపు దాడులతో వార్తల్లో నిలిచాడు. హై-ఎండ్ కార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సమయంలో తక్కువ విలువ చూపించి సుమారు రూ.100 కోట్ల కస్టమ్స్ సుంకాలను ఎగవేసిన అతన్ని గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. నకిలీ ఇన్‌వాయిస్‌లు, పత్రాలతో స్కెచ్ వేయడంతో పాటు డ్రైవింగ్ సిస్టమ్ మార్పుల ద్వారా అక్రమ ప్రయోజనం పొందినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

ఈ స్కాంలో ఖాన్ సహా మరో వ్యక్తి డాక్టర్ అహ్మద్‌ ప్రమేయం ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుర్తించారు. అమెరికా, జపాన్ నుంచి దిగుమతి చేసిన కార్లను మొదట శ్రీలంక లేదా దుబాయ్‌కి తరలించి అక్కడ వాటి డ్రైవ్ సైడ్ మార్చించారు. అనంతరం వాటిని తక్కువ ధరలతో ఇండియాకు తీసుకురావడానికి నకిలీ పత్రాలు ఉపయోగించారు.

హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, ల్యాండ్ క్రూయిజర్ వంటి భారీ మోడళ్లను ఇలా అక్రమంగా దిగుమతి చేసినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఖాన్ నిర్వాహకుడైన ‘కార్ లాంజ్’ షోరూమ్‌తో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ నెట్‌వర్క్ వ్యాపించి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఖాన్ న్యాయ అన్వేషణలో ఉన్నప్పటికీ, ఈ స్కామ్ మరింత మందలిపోతుందా అన్నది ఉత్కంఠగా మారింది.