బస్సు కండక్టర్‌గా ఉన్న రజనీకాంత్ ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరిన రజనీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల ప్రేమలను పొందాడు. అతని సినిమా వస్తుందంటే అభిమానులలో జోష్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు సినిమాలతో అలరించిన రజనీకాంత్ ఇప్పుడు రాజకీయాలలోకి రాబోతున్నారు. ఎప్పటి నుండో రజనీకాంత్ రాజకీయారంగేట్రం గురించి జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై సస్పెన్స్ కొనసాగిస్తూనే వచ్చాడు తలైవా.
రీసెంట్‌గా అభిమాన సంఘాలతో చర్చించిన తర్వాత పార్టీ పెట్టబోతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందని, జనవరిలో పార్టీ ప్రారంభిస్తానని అన్నారు. అయితే రజనీకాంత్ పార్టీ జెండా, అజెండా, గుర్తుల విషయంలో తలమునకలు అవుతుండగా, తన పార్టీకి ఆటో సింబల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. అలానే పార్టీ పేరు ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) అని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
జనవరిలో పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పినప్పటి నుండి ఏ రోజు ప్రారంభిస్తారనే దానిపై తమిళ నాట జోరుగా చర్చ నడుస్తుంది. తమిళ పొంగల్ సందర్భంగా జనవరి 14న రజనీకాంత్ తన పార్టీ లాంచ్ చేస్తాడని కొందరు అంటుంటే మరి కొందరు ఎంజీఆర్ జయంతి రోజు అంటే జనవరి 17న ప్రారంభిస్తాడని చెబుతున్నారు. నటుడిగా రాణించిన ఎంజీఆర్ రాజకీయాలలోను తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయనని స్పూర్తిగా తీసుకొని రాజకీయాలలోకి వస్తున్న రజనీకాంత్ ఎంజీఆర్ జయంతి రోజే పార్టీ ప్రారంభిస్తాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ 31న దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.ఇదిలా ఉంటే తలైవా ప్రస్తుతం అన్నాత్తె అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు