ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్… ఏడుపు మాములుగా లేదుగా !

ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం భారతీయులందరికీ ఎంతో గర్వకారణమైన విషయం. ఇది తెలుసు సినిమాకా, సౌత్ సినిమాకా అన్న ఆలోచన లేకుండా… ఇది భారతీయ సినిమా అని మెజారిటీ జనం అభినందనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ… బాలీవుడ్ బ్యాచ్ లోని కొంతమంది మాత్రం “ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్” రావడంపై కక్కలేక మింగలేక కుమిలిపోతున్నారు! ఈ లిస్ట్ లో ఉన్న బ్యాచ్ లో కొంతమంది పైకి చెప్పలేక లోలోపలే కుమిలిపోతుంటే.. ఒకరిద్దరు మాత్రం ఒపేన్ గానే వాళ్ల అక్కసు వెళ్లగక్కుతున్నారు. వారికున్న అజీర్ణ రోగాన్ని బయటపెట్టుకుంటున్నారు.

అవును… బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటు పాటకు, బెస్ట్‌ షార్ట్‌ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ ఆస్కార్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన కొందరు.. ఈ రెండు చిత్రాలపైనా తమ అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇందులో భాగంగా… బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌, క్లోజ్‌ ఫ్రెండ్‌ షాన్‌ ముట్టతిన్‌ ఈ విషయంలో బయటపడిపోయాడు. ఆర్.ఆర్.ఆర్. ఆస్కార్‌ విజయంపై తన కుల్లుబోతు తనాన్ని వ్యంగ్యాస్త్రాలుగా మార్చి సంధించాడు.

“హహ్హ, ఇది భలే ఉంది. ఇండియాలో ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నాను కానీ ఏకంగా ఆస్కార్‌ ను కూడా కొనేస్తారని ఊహించలేదు. అంతా డబ్బు మహిమ, డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అది ఆస్కార్‌ అయినా!” అని ఇన్‌ స్టాగ్రామ్‌ పోస్ట్‌ కింద కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరోపక్క ఇతగాడి అజీర్ణ రోగానికి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అయితే ఇతగాడి అజీర్తికి కారణం లేకపోలేదులెండి! తన స్నేహితురాలు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించిన “టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ వుమెన్‌” సినిమాలోని “అప్లాజ్‌” కూడా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ కు పోటీపడింది. అయితే ఆ పాటను చీ పో అంటూ వెనక్కు నెట్టిన “నాటు నాటు” అవార్డు గెలుచుకుంది. దీంతో ఆడలేక మద్దెల ఓడన్నట్లు ఇలా తన అక్కసును కక్కుతున్నాడు ఈ ముట్టతిన్!