GOOD NEWS భారత సైన్యంలో కొత్త అధ్యాయం, జవాన్లుగా మహిళలకు ఆహ్వానం

ఈ రోజు అంటే ఏప్రిల్ 25, 2019 గురువారం నాడు భారత సైనిక చరిత్ర లో నూతనాధ్యాయం మొదలయింది.

ఇంతవరకు పురుషులకే పరిమితమయిన సైన్యం లోని కొన్ని ఉద్యోగాలను ఇపుడు మహిళలకు అందుబాటులోకి తెస్తున్నారు.

సైన్యంలోకి మహిళలను రిక్రూట్ చేసుకోవడం ఈ రోజు నుంచి మొదలయింది. మిలిటరీలో యుద్ధంతో సంబంధం లేని విభాగాలలో జవాన్లుగా మహిళలను నియమించేందుకు గురువారంనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

కోర్ ఆఫ్ మిలిటరీ పోలీసులోకి నియామకాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలయింది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 8. ఈ విభాగం యుద్ధ విధులను నిర్వర్తించదు. వీరిని సోల్జర్ జనరల్ డ్యూటీ అని పిలుస్తారు.

ఇంతవరకు ఆర్మీలో మహిళలను ఆధికారుల ర్యాంక్ లోనే నియమించే వారు. ఇపుడు జవాన్లుగా కూడా మహిళలను తీసుకోవడం ఇదే మొదటిసారి.

మిలిటరీ పోలీస్ లోకి మహిళలను తీసుకోవాలనుకునే ప్రతిపాదనకు జనవరిలోనే రక్షణ శాఖ ఆమోదం పొందింది. సైన్యంలోని మూడు విభాగాలలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ప్రతిపాదనను చాలా అధ్యయనం తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. ఇది ఒక మహిళ రక్షణ మంత్రిగా ఉన్నందుకే సాధ్యమయిందేమో. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పదవీ కాలంలో తీసుకున్న ఒక విప్ల వాత్మక నిర్ణయం ఇదని చెబుతన్నారు.

 

ఇపుడు మహిళలను ఆఫీసర్లు నియమిస్తున్నా, వారిని యుద్ధ విధుల్లోకి తీసుకోవడం లేదు.ఫార్వర్డ్ లోకేషన్స్ లో పోస్టింగ్ ఇచ్చినా, వారిని కేవలం కోర్ ఆఫ్ సిగ్నల్స్, కోర్ ఆప్ ఇంజనీర్స్ విభాగాలలోనే తీసుకుంటూ వచ్చారు.

ఈ రోజు మొదలయిన రిక్రూట్ మెంట్ ప్రాసెస్ తో క్రమంగా కోర్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (ఆఫ్ ది ఆర్మీ)లో వారి ప్రాతినిధ్యం 20 శాతం దాకా పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారు.

ఈ విభాగంలో మహిళల ప్రవేశం వల్ల కొన్ని రకలా పనులు మెరుగు పడతాయని భావించవచ్చు.
మిలిటరీమీద రేప్, లైంగిక దాడుల , దొంగతనాల వంటి ఆరోపణలు వచ్చినపుడు జరిగే దర్యాప్తులో మహిళలు పాల్గొంటే ఫలితాలు భిన్నంగా ఉండవచ్చు.

యుద్ధ ఉద్రికత్త ప్రాంతాలలోని గ్రామాలను ఖాళీచేయించేందుకు వీరిని నియోగిస్తారు.
మహిళా కాందీశీకుల గుంపులను అదుపు చేసేందుకు వీరి నియమిస్తారు.

యుద్ధఖైదీల శిబిరాల నిర్వహణలో కూడా మహిళలను నియమిస్తారు. మహిళ ప్రమేయం వల్ల కొన్ని రకాల విచారణలుసక్రమంగా జరగుతాయని ఆశించవచ్చు.