మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఏటీఎం కార్డుతో లావాదేవీలు చేస్తున్నారా? అయితే మీకు షాకే. మీ ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు వివరాలు రహస్యంగా ఉన్నాయనుకుంటే పొరపాటే. మీ కార్డు నెంబర్లు, సీవీవీ కోడ్స్, మీ పేరు, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ హ్యాక్ అయ్యాయి. మొత్తం 70 లక్షల మందికి చెందిన కార్డుల వివరాలు డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉందని ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్లు వెల్లడించారు.
వారి పేర్లు, వారు ఉద్యోగం చేసే కంపెనీల వివరాలు, వార్షిక ఆదాయం వంటి వివరాలు కూడా లీక్ అయ్యాయని నిర్దారించారు.కాగా లీక్ అయిన వివరాలకు చెందిన డేటాబేస్ సైజ్ 2జీబీగా ఉందని తెలిపారు. 2010 నుంచి 2019 వరకు పలువురు కార్డు వినియోగదారులకు చెందిన డేటా లీక్ అయినట్లు నిర్దారించారు. డేటాను బ్యాంకులకు సేవలు అందించే థర్డ్ పార్టీ కంపెనీలకు చెందిన వారే లీక్ చేసి ఉంటారని నిపుణులు తెలిపారు.
అయితే డేటా లీక్ అయిన నేపథ్యంలో కార్డుల వినియోగదారులు వెంటనే తమ కార్డుల పిన్ నంబర్‌లు, అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక సదరు 70 లక్షల మందికి చెందిన పాన్ కార్డుల సమాచారం కూడా లీకైనట్లు నిర్దారించారు.