మోదీ అయువు పట్టున నాలుగో దశ పోలింగ్ మొదలయింది…

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని  భారతీయ జనతా పార్టీకి నిజమయిన పరీక్షా సమయం సోమవారం మొదలయింది.

దేశంలో కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ కు జనం క్యూ నడుతున్నారు. బిజెపిని 2014లో అధికారంలోకి తీసుకు వచ్చిన హీందీస్తాన్ లోని 9 రాష్ట్రాలలోని 71 లోక్ సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ మొదలయింది.

నిజానికి ఇక్కడంతా బిజెపి హవాయే ఉండాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఈ 71 స్థానాల్లో56 స్థానాలను బిజెపి గెల్చుకుంది. అంటే దాదాపు 80 శాతం సీట్లన్నమాట అందుకే ఈ సారి బిజెపి అధికారంలోకి రావాలంటే ఈ దశ ఎన్నిక చాలా కీలమయింది. ఈ దశలో మహారాష్ట్రలో 17 స్థానాలకు, రాజస్థాన్లో 13, ఉత్తర ప్రదేశ్ లో 13, బెంగాల్ లో 8, ఒడిషా, మధ్యప్రదేశ్ లో ఆరేసి, జర్ఖండ్ లో 3, జమ్ము కాశ్మీర్ లో 1 స్థానంలో పోలింగ్ జరుుగుతూఉంది. ఈ 56 స్థానాలను కాపాడుకుంటే మోదీకి మోక్షం.

ఈ రాష్ట్రాలలో 2014 ఎన్నికలపుడు ఎక్కడయితే బిజెపి బలంగా ఉండిందో అక్కడ ఇపుడు బాగా బలహీనపడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో అధికారం కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి.

మహారాష్ట్రలలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. అక్కడ ప్రభుత్వం నిలకడగా కనిపించినా, రాష్ట్రంలో రైతులు బాగా ఆగ్రహంతో ఉన్నారు. రైతుల కోసం 2014 లో ప్రకటించిన పథకాలతో పాటు రుణమాఫి వంటవేవీ అమలుకాలేదన్నది వారివిమర్శ. ఉద్యోగాలు రాలేదు.దీనివల్ల యువకుల్లో అసంతృప్తి బాగా ఉందని వార్తలొస్తున్నాయి.

మహారాష్ట్రలో శివసేనతో చివరకు బిజెపికి పొత్తుకుదిరినా అక్కడ రాజ్ ధాకరే మోదీకి బలమయిన విమర్శకుడయిపోయారు.

ఇక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు వ్యతిరేకత బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సూచనలు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి పట్టుకోల్పోవడమే, చివరకు యోగి అదిత్యనాథ్ సొంత లోక్ సభ నియోజకవర్గం గోరఖ్ పూర్ కూడా బిజెపి చేజారిపోయింది. దీనికితోడు ఉత్తర ప్రదేశ్ లో ఈసారి బిజెపి బలమయిన బిఎస్ పి, ఎస్ పి కూటమితో పోరాడాలి.

అక్కడ బిజెపి, కూటమి, కాంగ్రెస్ త్రిముఖ పోటి బిజెపికి ఉపయోగపడుతుందునుకున్నా కాంగ్రెస్ చాలా చోట్ల బలహీనమయిన పోటీలోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలిపోయే అవకాశం లేదు.

దానికి తోడు కాంగ్రెస్, మాయా-అఖిలేష్ కూటమి మధ్య ఒక అప్రకటిత అలయన్స్ ఉందని, కూటమి అభ్యర్థులు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ నామమాత్రపుపోటీ పెట్టిందని, అలాగే కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఈ పార్టీ విజయావకాశాలు దెబ్బతీయకుండా కూటమి కూడా అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేసిందని వార్తొలొచ్చాయి.

అందువల్ల నాలుగోదశ పోలింగ్ కు వెళ్తున్న 71 స్థానలలో బిజెపి తన 56 నియోజకవర్గాలను నిలుపుకోవడమే పెద్ద చాలెంజ్. ఇపుడు పోలింగ్ కు పోతున్న మహారాష్ట్రలోని 17 స్థానాలను పరిశీలిద్దాం. 2014లో పరిస్థితి మొత్తం బిజెపికి అనుకూలంగా ఉంది.

అక్కడ అప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం మీద ప్రజల్లో నిరాసక్తత మొదలయింది. దానికి తోడు మోదీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాకా, కొత్తదనం వూపు వెల్లవలాగా మొదలయింది.

వీటికి తోడు శివసేనతో బలమయిన పొత్తు ఉంది. వీటన్నింటి కారణంగా బిజెపి శివసేనల కూటమితో ఈ మొత్తం 17 స్థానాలను వూడ్చేసింది.అయితే, గత అయిదేళ్ళో బిజెపి ప్రభుత్వం ఇక్కడ చాలా ఎదురు దెబ్బలను ఎదుర్కొంది.

ముంబాయి నగర జీవితం ఏ మాత్రం మార లేదు.అవే సమస్యలు. అయిదేళ్లలో వుత్త జాతీయ వాద రభస తప్ప నగరంలోని వసతులేవీ మెరుగుపడలేదనే విమర్శ ఉంది. దానికి తోడు ఇపుడు రాజ్ ధాకరే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో గతంలో గెల్చిన 17 స్థానాలను నిలపుకోవడం సాధ్యం కాకపోవచ్చు.

ఇక రాజస్థాన్ విషయానికొస్తే, అక్కడ ఈ మధ్య నే బిజెపి కి పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని దించేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ  రోజు పోలింగ్ కు పోతున్న 13 నియోజకవర్గాలను 2014 లో బిజెపి గెల్చుకుంది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం లేదక్కడ. ఆమేరకు బిజెపి బలహీన పడినట్లే. మరి ఉన్న స్థానాలను కాపాడుకునేందుకు యుద్ద  నినానాదాలు పనికొస్తాయా?

అటువైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి ఈ సారి 13 నియోజకవర్గాలను గెలచి నిలపుకోగలదా, అనుమానమే.

రాజస్థాన్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రం కాబట్టి, ప్రధాని జాతీయ వాదం, పుల్వామా, బాలకోట్, పాకిస్తాన్ తో యుద్ధం వంటి మాటలు మీద ఆదారపడాలి.బిజెపి అదే పనిలో ఉంది.

దీనికి పోటీగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను పెద్దగా ప్రచారం చేస్తున్నది. ముఖ్యంగా నెలకి ఆరువేల రుపాలయ న్యాయ్ స్కీమ్ ను కాంగ్రెస్ మోదీ మీద బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తున్నది.

ఇక ఉత్తర ప్రదేశ్ లోని అవధి, బుందేల్ ఖండ్ ప్రాంతలోని 13 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంది. 2014 లో వీటిలో 12 ని బిజెపి గెల్చుకుంది. మరి వాటిని నిలుపుకోగలుగుతుందా? ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉంది. యోగి ఆకర్షణ బాగా తగ్గినట్లు ఇటీ వలి ఉపఎన్నికలు చెబుతున్నాయి.

అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ -బిజెపి- బిఎస్ పి,ఎస్సి ల కూటమిల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అది తనకు లాభిస్తున్నది బిజెపి భావించవచ్చు. అయితే, ఇక్కడ కాంగ్రెస్- కూటమిల మధ్య సర్దుబాటు ఉన్నట్లు అర్థమవుతుంది. ఒక వేళ అది లేదనుకున్నా కచ్చితంగా ఇక్కడ 2014 నాటి మోదీ సుడిగాలి కనిపించదు.

2014 లో లాగా మోదీ  సుడిగాలి లేకపోవడంతో  పాకిస్తాన్ వ్యతిరేక సుడిగాలి సృష్టించే ప్రయత్నం మోదీ చేస్తున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ ఎన్నికల కమిషన్ విధించిన బాలకోట్ , పుల్వామా అంక్షలను ఉల్లంఘించి ప్రచారం చేస్తున్నది ఒక నాటి బిజెపి రాష్ట్రాలలోనే.

ఇదీ పరిస్థితి. గ్రామాలలో వ్యవసాయ సంక్షోభం అన్ని రాష్ట్రాలలో కనిపిస్తుంది. ఒక వర్గం యువకుల్లో ఉద్యోగాలు రాని నిరాశ ఉంది. 2014 లో మోదీ అస్త్రంగా వాడుకున్నది ఈ అంశాలనే. ఈ రంగాలలో ఆయన సాధించిందేమీ లేదు. అందుకే ఇపుడు ఆయన ఒక సెక్షన్ నగర యువకులకు ఆకర్షణీయంగా కనిపించే జాతీయవాదం, పుల్వామా,బాలకోట్, యుద్ధం, సైన్యం వంటి భాషను ప్రయోగిస్తున్నారు.