రాహుల్ సభలో రేవంత్ కోసం నినాదాలు

రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా చివరి మీటింగ్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగింది. ఈ సభ రాహుల్ వచ్చే కంటే ముందే ప్రారంభమైంది. భారీ నాయకత్వం ఉన్న కారణంగా రాహుల్ వచ్చే కంటే ముందే కొందరు నాయకులు మాట్లాడేశారు. తర్వాత రాహుల్ వచ్చిన తర్వాత ఉత్తమ్ మాట్లాడారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆయన తర్వాత బట్టి విక్రమార్క మాట్లాడే సమయంలో సభలో రేవంత్ అభిమానులు గోల షురూ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ మాట్లాడాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో బట్టి విక్రమార్క త్వరగానే తన ప్రసంగం పూర్తి చేశారు. ఆయన తర్వాత మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడారు. ఆ తర్వాత రేవంత్ మాట్లాడారు.

రేవంత్ ప్రసంగం షురూ చేస్తూనే కేసిఆర్ పై విరుచుకుపడ్డారు. ‘‘బిడ్డా కేసిఆర్ చాలా.. ఇంకా కావాల్నా? ఇంకా కావాలంటే సింగరేణిలో గర్జిస్తాం. కాకతీయ కోటలో కదం తొక్కుతం. పరేడ్ గ్రౌండ్ లో వదరలై పారిస్తం’’ అని కేసిఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. సమయా భావం కారణంగా పార్టీ నేతలంతా కొద్దిసేపు మాత్రమే ప్రసంగాలు చేశారు. రేవంత్ కూడా కొద్దిసేపే మాట్లాడారు.

రేవంత్ ఇంకా ఏమన్నారో కింద చదవండి. రాహుల్ గాంధీ అధ్యక్షత వహించిన పార్టీలో కార్యకర్తలుగా పనిచేయడం మన అదృష్టం. ఈ మధ్య కాలంలో కొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ దేశానికి అని అడుగుతున్నారు. 1965లో, 1971లో శత్రు దేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిపించింది ఇందిరాగాంధీ. 6 లక్షల40వేల గ్రామాలకు కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.  

ఈ రాష్ట్రంలో శ్రీశైలం కట్టింది మనం, నాగార్జున సాగర్ కట్టింది మనం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం. అలాంటి మనల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగతరా? మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినం కాబట్టే కేసిఆర్ ముఖ్యమంత్రి అయిండు. కేసిఆర్ ను దింపి కాంగ్రెస్ ను గెలిపించేందుకు పోరాటం చేద్దామా? జై సోనియమ్మ జై సోనియమ్మ. జై కాంగ్రెస్ పార్టీ ..

రేవంత్ మాట్లాడిన ఫుల్ వీడియో కింద ఉంది చూడండి.