ద్రౌపదీ ముర్ముకు మాత్రమే సొంతమైన రికార్డ్ ఏంటో తెలుసా?

ఈరోజు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం తర్వాత ద్రౌపదీ ముర్ము మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒడిశాలోని ఓ మారుమూల ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన తాను దేశ అత్యున్నత పదవిని చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇది నా వ్యక్తిగత విజయం కాదని దేశంలోని పేద ప్రజలందరికి దక్కిన విజయం అని ఆమె తెలిపారు.

మన దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని ఆ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పడానికి నేనే రుజువు అని ద్రౌపదీ ముర్ము చెప్పుకొచ్చారు. బాల్యంలో నేను ప్రాథమిక విద్య చదువుకోవడమే కలగా ఉండేదని ఆ స్థాయి నుంచి నేను ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. 50 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల వేళ నా పొలిటికల్ లైఫ్ ప్రారంభమైందని ఆమె చెప్పుకొచ్చారు. 75 సంవత్సరాల ఉత్సవాళ వేళ ప్రథమ పౌరురాలిగా ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె వెల్లడించారు.

స్వతంత్ర భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తిని నేనని చెబుతూ తను సాధించిన అరుదైన రికార్డ్ గురించి ద్రౌపదీ ముర్ము చెప్పుకొచ్చారు. సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా పని చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. అందరి సహకారంతో ఉజ్వల యాత్రను కొనసాగించాల్సి ఉందని ద్రౌపదీ ముర్ము అన్నారు. యువత భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించకుండా దేశ పురోగతికి బాటలు వేయడంపై కూడా దృష్టి పెట్టాలని ఆమె కోరారు.

రాష్ట్రపతిగా యువతకు నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి ముర్ము మాట్లాడిన మాటలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయి. రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము కీలక నిర్ణయాలు తీసుకోవడం గ్యారంటీ అని యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ద్రౌపదీ ముర్మును అభిమానించే అభిమానులు అంతకంతకూ పెరుగుతున్నారు.