తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ప్రధాని మోడీ ఆలోచనా విధానం అని అంటున్నారు పరిశీలకులు. సుమారు మూడు వేళ కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చే ధైర్యం ఉన్న వారు.. పార్లమెంట్ లో ఒక్క ప్రకటన చేయడానికి వణికిపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ధైర్యం అంటే కబుర్లు చెప్పడంలో కాదు.. కార్యాచరణలో ఉండాలని హితవు పలుకుతున్నారు.
మణిపూర్ లో జరుగుతున్న దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంమొత్తం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎన్నో మణిపూర్ లో జరుగుతున్నాయి! ఈ సమయంలో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది.. కేంద్రంలోనూ బీజేపీ సర్కారే ఉంది. అంటే బీజేపీ నాయకుల మాటల్లో “డబుల్ ఇంజిన్ సర్కార్” అన్నమాట. కాకపోతే ఆ ఇంజిన్ లో ఇందనం లేదు అంతే! ప్రస్తుతం ఇవే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మణిపూర్ లో మహిళల మీద జరిగిన అత్యాచార పర్వంపై యావత్ జాతి ఇప్పటికీ విచారిస్తోంది.. తీవ్రంగా చర్చిస్తోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉదాసీనతపై వ్యవహరిస్తోందని తెలుస్తుంది. దీంతో.. సోషల్ మీడియాలో మోడీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా భారత ప్రతిష్టని దిగజార్చిన ఈ దుర్మార్గం మీద దేశవిదేశాలలో చర్చలు జరుగుతున్నా.. ఈదేశ పార్లమెంట్ లో మాత్రం చర్చించేందుకు బీజేపీ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ధైర్యం చాలడం లేదు!!
ప్రపంచమంతా తిరుగుతూ భారతదేశంలోని ప్రజాస్వామ్యం గురించి చెప్పే మోడీ… మణిపూర్ అంశంపై పార్లమెంటులో ఒక ప్రకటన చేయడానికి మాత్రం ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఆయన మార్కు ప్రజాస్వామ్యం అయ్యి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఈ దెబ్బ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా పెట్టబోయే వాత మామూలుగా ఉండదని హెచ్చరిస్తున్నారు.
అయినా పర్లేదు… జనం మర్చిపోతారులే అనేది మోడీ నమ్మకం అయ్యి ఉండొచ్చు. జనాలకు అంత పౌరుషం ఎక్కడుంది అనేది ఆయన భరోసా అయ్యి ఉండొచ్చు. మరో మూడు వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పిస్తే నిజంగానే భారతదేశం వెలిగిపోతుందేమో అని మరోసారి తనను అందలం ఎక్కిస్తారు అనే ధైర్యం అయ్యి ఉండొచ్చు. దేశప్రజల జ్ఞాపకశక్తిపై అంత విశ్వాసం అయ్యి ఉండొచ్చు. ఫలితంగా… మోడీ నిర్లక్ష్యానికి ఇవే కారణాలు అయ్యి ఉండొచ్చు. అని అంటున్నారు విశ్లేషకులు.
దేశ ప్రజలకు తాను చేసిన అన్యాయాలపై, అనుసరిస్తున్న విధానాలపై ప్రశ్నించేటంత ధమ్ము లేదు.. ఎన్నికల్లో నిలువరించగల సత్తా లేదు.. అసలు అప్పటివరకూ ఈ విషయం గుర్తుండే అంత జ్ఞాపకశక్తీ వాళ్లకు లేదు.. అని మోడీ భావిస్తున్నారో ఏమో కానీ… ప్రజాస్వామ్య దేవాలయంగా పార్లమెంటును అభివర్ణించే బీజేపీ పెద్దలు, అదే పార్లమెంటులో మణిపూర్ ఘటనపై సుదీర్ఘంగా చర్చించాలంటే జంకుతున్నారని తెలుస్తోంది.
పార్లమెంటులో వస్తువుల ముందు పడుకుని మరీ నమస్కారం చేసే మోడీ… సామాన్య ప్రజల విషయంలో మాత్రం కాస్తైనా తగ్గడం లేదునే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. పాపం మణిపూర్ ప్రజలు అనే ఆలోచన మోడీ చేయడం లేదు. బహుసా సెంటిమెంట్స్ లేకవపోవడమే దీనికి కారణమా.. లేక, అక్కడ బలవుతున్నది గిరిజనులే కదా అనే నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు తెరపైకి వతోన్న కూడా… మోడీ వారిపై పార్లమెంటులో చర్చించేందుకు అరగంట సమయం కూడా కేటాయించలేకపోతున్నారు.
మణిపూర్ నడివీధుల్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించడం గురించి ప్రశ్నిస్తే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హింసని లేవనెత్తుతున్నారు. ప్రధాని పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ ను అంగీకరించలేకపోతున్నారు. ప్రధాని ప్రకటన కోసం పట్టుబట్టడమే నేరమన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ కుమార్ ను వర్షాకాల సమావేశాల వరకు సభలో అడుగు పెట్టకుండా సస్పెండ్ చేశారు. దీంతో ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వాన్ని ప్రజలకు ఇంత ఘోరంగా పరిచయం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విధంగా… యావత్ దేశచరిత్రను మంటగలిపిన మణిపూర్ ఘటనపై పార్లమెంటులో పెదవి విప్పేందుకు మోడీ సిద్ధపడకపోవటం దేశాన్ని నివ్వెర పరుస్తోంది. దీంతో… పార్లమెంటులో మణిపూర్ పరిణామాల మీద తమ వైఫల్యాన్ని అంగీకరించడానికి మోడీ సిద్ధంగా లేరని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రెండు నెలల తరబడి మణిపూర్ లో హింసాకాండ కొనసాగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఫలితమేనని బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు. వీరిలో ప్రధానంగా… బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి… మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు!
మోడీ కనీసం ఆదిశగా కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. అలా చేస్తే రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో తమకు అవమానం అని భావిస్తున్నారే తప్ప… అంతకంటే ఈ మౌనం మరింత ఎక్కువ డ్యామేజీ అనే ఆలోచన చేయలేకపోతున్నారు. ఫలితంగా… అటు రాజకీయంగానూ, ఇటు మానవత్వంగానూ, మరోపక్క వయసులో పెద్దవాడిగానూ, హిందూ సంప్రదాయాలకు విలువిచ్చేవారిగానూ, మానవ సేవే మాదవసేవ అని నమ్మేవారిగానూ కూడా మోడీ చులకన అయిపోతున్నారు అని అంటున్నారు పరిశీలకులు.