ఆలయంలోకి ప్రవేశించాడని దళిత యువకుడి పై దాడి.. చెట్టుకి కట్టేసి మరి దారుణం..!

దేశం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య కులమతాలు తేడా లేదని అందరూ సమానమేనని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ సమాజంలో దళిత కులాల ప్రజలను చిన్నచూపు చూస్తున్నారు. గ్రామాలలో దళిత కులాల ప్రజలకు అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ఆంక్షలు అధిక్రమించిన వారిపై అగ్రకులాల వారు దాడులకు దిగుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. దేవుడికి పూజ చేయటానికి ఆలయంలోకి ప్రవేశించిన ఒక దళిత యువకుడి పై గ్రామస్తులు దారుణంగా దాడి చేశారు. రాత్రంతా చెట్టుకు కట్టేసి మరి దాడి చేశారు.

వివరాలలోకి వెళితే…బైనోల్ గ్రామానికి చెందిన ఆయుష్ (22) అనే దళిత యువకుడు జనవరి 9వ తేదీన ఉత్తరకాశి జిల్లాలోని మోరి ప్రాంతంలో ఉన్న ఆలయంలోని దేవుడికి పూజలు నిర్వహించటానికి ఆలయంలోకి ప్రవేశించాడు. అయితే దళిత కులానికి చెందిన ఆ యువకుడు అలా ఆలయంలోకి ప్రవేశించడంతో అగ్రకులాలకు చెందిన గ్రామస్తులు అతడిని ఆలయంలో నుంచి బయటకు తోసేసి అతడి మీద దాడికి దిగారు. గ్రామస్తులందరూ కలిసి ఆ యువకుడి మీద దాడి చేయడమే కాకుండా రాత్రంతా యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు.

అంతేకాకుండా నిప్పుల్లో కాల్చిన కర్రలతో యువకుడి శరీరాన్ని గాయపరిచారు. ఆలయంలోకి ప్రవేశించినందుకు అగ్రకులాల వారు తనపై దాడి చేసినట్లు సదరు బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెట్టుకు కట్టేసి రాత్రంతా తీవ్రంగా కొట్టారని,మంటలో కాల్చిన కర్రలతో తనపై దాడి చేశారని ఆయుష్ వెల్లడించాడు. ఈ ఘటన గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.