Co-Vaccine: వారెవ్వా.. కోవిషీల్డ్ బాటలోనే కోవాగ్జిన్ రేటు కూడా తగ్గింది. కాస్సేపటి క్రితం భారత్ బయోటెక్ సంస్థ, తమ కోవాగ్జిన్ రేటుని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ తగ్గింపు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమేనండోయ్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి కోవాగ్జిన్ టీకా ఓ డోసుకిగాను 150 రూపాయల ఖర్చవుతోంది.
దీన్ని కేంద్రం, ఉచితంగానే అందిస్తోంది. అయితే, మే 1 నుంచి 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వయసున్నవారికి కూడా టీకా అందించనున్న దరిమిలా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు అలాగే ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల వద్ద వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ, అందుకు ప్రత్యేక ధరల్ని నిర్ణయించే అవకాశం ఆయా సంస్థలకు అప్పగించింది. ఇదే, ఈ నిర్ణయమే పెను దుమారానికి కారణమవుతోంది. దేశ ప్రజలందరికీ ఉచితంగా దక్కాల్సిన వ్యాక్సిన్, రాష్ట్ర ప్రభుత్వాలకొచ్చేసరికి, అధిక ధరకు ఎందుకు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
తొలుత డోసుకి 400 రూపాయలుగా కోవిషీల్డ్ ధర నిర్ణయించిన సీరం సంస్థ, వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో 300 రూపాయలకే పరిమితం చేసింది. భారత్ బయోటెక్ అయితే, ఏకంగా రెండొందలు తగ్గించి 600 నుంచి 400 రూపాయలకే తమ టీకా రాష్ట్ర ప్రభుత్వాలకు లభిస్తుందని ప్రకటించింది తాజాగా. చూస్తోంటే, ఇదేదో పెద్ద గ్యాంబ్లింగ్ తరహాలో అనిపించకమానదు. అత్యంత ఎక్కువ ధర ఒకేసారి చెప్పి, ఆ తర్వాత కాస్త తగ్గిస్తే, అక్కడికేదో తాము జనాన్ని ఉద్ధరించేస్తున్నట్లుగా జనం అర్థం చేసుకుంటారన్న భావనలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఈ పన్నాగానికి తెరలేపినట్లు అర్థం చేసుకోవాలేమో. ఇదిలా వుంటే, దేశంలో వ్యాక్సిన్ కొరత చాలా తీవ్రంగా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బలు వెచ్చించినా, వ్యాక్సిన్ దొరుకుతుందన్న నమ్మకం ప్రజల్లో వ్యక్తమవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలే, ఈ విషయమై పెదవి విరుస్తున్న పరిస్థితి.