బీజేపీ గెలిచింది: ప్రధాని మోడీని గెలిపించిన గుజరాత్.!

గుజరాత్‌లో బీజేపీ గెలిచిందని అనాలా.? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గుజరాత్ ప్రజలు గెలిపించారని అనాలా.? రికార్డు స్థాయి మెజార్టీని దక్కించుకుంది బీజేపీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇది. త్రిముఖ పోటీలో బీజేపీ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు ముందే అంచనా వేశారు.

అయితే, పంజాబ్ తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటొచ్చేమోనన్న అనుమానాలూ కొందరిలో వున్నాయి. కానీ, అందరి అంచనాలూ తల్లకిందులయ్యాయి.. గుజరాత్‌‌లో ఇంకోసారి కమలం వికసించింది. వరుసగా ఏడోసారి బీజేపీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

ఈ గెలుపు ముమ్మాటికీ గుజరాత్ ప్రజలదే. ఔను, తమ రాష్ట్రం నుంచి ప్రధాని పదవిలో కూర్చున్న తమ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని గుజరాత్ ప్రజలు గెలిపించారు. ఆ గుజరాత్ ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసేసుకున్నారు నరేంద్ర మోడీ.

గుజరాత్ అంటే మోడీ.. మోడీ అంటే గుజరాత్.! గుజరాత్ లేని మోడీ లేరు.. మోడీ లేని గుజరాత్ లేదు.. ఇలా సాగింది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. ‘గుజరాత్ భూమి పుత్ర’ అనే నినాదం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గట్టిగా వినిపించింది.

అందుకే, ఓటర్లు ఇంకో ఆలోచన లేకుండా బీజేపీ మీద ఓట్లు గుద్ది పారేశారు. దాదాపు 53 శాతం ఓట్లు బీజేపీకి వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుని ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చగలిగింది. అదే సమయంలో బీజేపీని ‘ఆప్’ టచ్ చేయలేకపోయింది.