ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన ఎన్నికల ప్రచార పర్వాన్ని ఆరంభించారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీనికోసం ఆయన బెంగళూరు సెంట్రల్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల అవసరాలు, స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు రాజకీయాల్లో ఎలాంటి మార్పు రావాలనే అంశంపై ఆయన ఆరా తీస్తున్నారు.
దీనికోసం స్థానికులతో కలిసి వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ప్రకాష్ రాజ్‌కు మద్దతు ప్రకటించిన ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు ఆయనకు సహకరిస్తున్నారు. ప్రజలు, కాలనీ సంఘాల నుంచి సేకరించిన అభిప్రాయాలతో మేనిఫెస్టోను రూపొందిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు.
నిజానికి- బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోట. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పీసీ మోహన్ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ స్వస్థలం బెంగళూరే. బెంగళూరుతో ఆయన సాన్నిహిత్యం ఉంది. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌కు ప్రకాష్ రాజ్ ఆప్తమిత్రుడు.
ఆమె హత్యోదంతం తరువాత రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్‌కు బీజేపీ, సంఘ్ పరివార్ అంటే గిట్టదు. గౌరీ లంకేష్ హత్య వెనుక హిందూ అతివాదులు ఉన్నారనేది ఆయన అభిప్రాయం. బీజేపీకి గట్టిపట్టు ఉన్న బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలో పోటీకి దిగడానికి ఇదీ ఓ కారణమని చెబుతున్నారు.