ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయ రంగప్రవేశం ఎప్పుడో ఖాయమైంది. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్వయంగా ప్రకాష్ రాజే వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిల్చుంటానని, ఏ పార్టీ తరఫునా పోటీ చేయబోనని ఆయన క్లారిటీ ఇచ్చారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎన్నికల రేసులో నిల్చోబోతున్నారు.
ప్రకాష్ రాజ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము ప్రకాష్ రాజ్ గెలుపు కోసం కృషి చేస్తామని ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. బెంగళూరు జైన్ భవన్‌లో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ కార్యవర్గ సమావేశానికి మనీష్ సిసోడియా హాజరయ్యారు.
బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోట. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పీసీ మోహన్ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ స్వస్థలం బెంగళూరే. కర్ణాటకలో ఆయన పేరు ప్రకాష్ రాయ్. బెంగళూరుతో ఆయన సాన్నిహిత్యం ఉంది. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌కు ప్రకాష్ రాజ్ ఆప్తమిత్రుడు. ఆమె హత్యోదంతం తరువాత రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు ప్రకాష్ రాజ్.
అభ్యుదయ భావాలు ఉన్న ప్రకాష్ రాజ్‌కు బీజేపీ, సంఘ్ పరివార్ అంటే ఏ మాత్రం గిట్టదు. గౌరీ లంకేష్ హత్య వెనుక హిందూ అతివాదులు ఉన్నారనేది ఆయన అభిప్రాయం. బీజేపీకి గట్టిపట్టు ఉన్న బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలో పోటీకి దిగడానికి ఇదీ ఓ కారణమని చెబుతున్నారు.