ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దేశానికి ఒక దిశ దశను నిర్దేశించాయి. ఈ పూర్వ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల్లో కేందం ఇంకా సాచి వేత వైఖరి అవలంభించేందుకు వీలు లేకుండా ఈ తీర్పు వుంది. 2019 జనరల్ ఎన్నికల్లో భావోద్వేగాల జాతీయ వాదంతో మతోన్మాద భావజాలంతో మోదీ షా ద్వయం ఒంటి చేత్తో దేశ వ్యాప్తంగా గెలుపు సాధించారు. అయితే మోదీ షా ద్వయం ప్రయోగించిన ఆయుధాలు కేవలం గాలి బుడగలని తేలి పోవడానికి ఎక్కువ కాలం పట్ట లేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజెపి ఒక్కో రాష్ట్రాన్ని పోగొట్టుకొంది. ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కన్నా శివ సేన ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. జాతీయ పార్టీగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోవడం మరో విశేషం.
దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం మూట గట్టుకొంది. దానితో పాటు కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోయింది. 2019 ఎన్నికల్లోనూ తదుపరి జరిగిన ఎన్నికల్లో బిజెపి వర్సెస్ ఇతర ఏ పార్టీ పోటీలో వున్న రాష్ట్రల్లో బిజెపి ఓటమి పాలు కావడం మరో ప్రత్యేకత. నిర్దిష్టంగా చెప్పాలంటే మోదీ షా హిందుత్వ జాతీయ వాదానికి ఢిల్లీ ఓట్లు చరమ గీతం పాడటమే కాకుండా దేశానికి కూడా ఒక సందేశం ఇచ్చారు. ఎందుకంటే వాళ్లు దేశ రాజధాని ప్రజలు.అంతేకాదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పుట్టుకొచ్చాయి. కాని మోదీ షా ద్వయం ఇటీవల ప్రాంతీయ పార్టీల ఎదుగుదలను అణగదొక్కారు. కాని అనతి కాలంలోనే దేశ ప్రజలు మేల్కొనడం విశేషం. ఈ క్రమంలోనో 2019 ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు పార్లమెంట్ స్థానాలు కైవశం చేసుకున్న బిజెపి నేడు ఘోర పరాజయం పాలైంది.ఈ ఎన్నికల ఫలితాలు బిజెపికి నేర్పే గుణపాఠాలు ఎక్కువగానే వుండ బోతున్నాయి. ఒంటి చేత్తో ఇక రాజకీయం దేశం మొత్తం మీద నడపడం కుదరక పోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక పరిస్థితుల బట్టి విధానాలు రూపకల్పన చేసుకోవడమే కాకుండా రాష్ట్రల్లో దృఢమైన నాయకత్వాన్ని బిజెపి పెంచి పోషించవలసి వుంటుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల్లో బిజెపి పార్టీగా గాని కేంద్ర ప్రభుత్వం గాని నిర్దిష్టమైన వైఖరి గైకొనక తప్పదు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోరులో చలి మంటలు కాచుకొనే పద్దతిని ఇంకా బిజెపి అవలంభించేందుకు వీలు లేని విధంగా ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు.ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొంది వుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్రం సాచి వేత నిర్లక్ష్య వైఖరి అవలంభించి రాష్ట్ర ప్రజలకు తీరని అపకారం కలిగించేది.రెండు ప్రాంతీయ పార్టీలకు పోట్లాట పెట్టి తమాషా చూస్తూ వుండేది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ ప్రమాదం తప్పింది. ఏదైనా బిజెపి ఖచ్చితమైన వైఖరితో ముందుకు రాక తప్పదు లేదా సింగిల్ డిజిట్ ఓటింగ్ శాతం మరింత దిగ జారక తప్పదు. అంతే కాదు బీజేపీకి బీహార్ అసెంబ్లీ ఎన్నకల రూపంలో మరో ముసళ్ల పండుగ ముందరుంది.
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013