కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో సచిన్

Sachin Pilot
రాజస్థాన్ రాజకీయం రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది.  సొంత పార్టీ మీద తిరుగుబాటు ప్రకటించిన ఎంపీ సచిన్ పైలెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే దాని మీదే కాంగ్రెస్ ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది.  తనను కాదని సీనియర్ నాయకుడనే కారణం చూపి అశోక్ గెహ్లాట్ ను సీఎం పీఠం మీద కూర్చోబెట్టడంతో సచిన్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  దానికి తోడు డిప్యూటీ సీఎం అయినప్పటికీ తన మాటకు విలువ ఇవ్వకుండా, తన ప్రాధాన్యతను తగ్గిస్తూ ఉండటం, అశోక్ గెహ్లాట్ వర్గం తన మీదే ఎదురుదాడికి దిగడంతో తనకు మద్దతుగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లారు సచిన్.  
 
ఢిల్లీలో భాజపా నేతలతో సచిన్ మంతణాలు జరుపుతున్నారట.  తనకు సీఎం పదవి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడాకి సిద్దంగా ఉన్నట్టు సచిన్ భాజపా అధిష్టానానికి తెలిపారని, కానీ సీఎం పదవిని సచిన్ పైలెట్ చేతిలో పెట్టడానికి భాజపా సుముఖత చూపలేదని, దాంతో సచిన్ వారితో చేతులు కలిపే ఆలోచనను విరమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఇటు కాంగ్రెస్ పార్టీతో రాజీ పడక, అటు బీజేపీ షరతుకు తలొగ్గక సచిన్ ఏం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 
 
ఆ పార్టీకి ‘ప్రగతిశీల కాంగ్రెస్’ అనే పేరును అనుకుంటున్నారని కూడా తెలుస్తోంది.  ఇదే గనుక జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అనిశ్చితిలో పడటం ఖాయం.  కొత్త పార్టీ అవతరిస్తే ఇప్పటికే సచిన్ తరపున నిలబడిన ఎమ్మెల్యేలే కాకుండా ఇంకొంతమంది కూడా ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము సచిన్ పైలెట్ వాదనను వినడానికి, సమస్య పరిష్కారానికి సిద్దంగా ఉన్నామని, కానీ ఎలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని అంటోంది.  వారి మాటలను బట్టి సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి కావాలనే కోరికను కాంగ్రెస్ ఆమోదించేలా కనబడటంలేదు. మరి సచిన్ పైలెట్ తలొగ్గి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారో లెకపోతే సొంత పార్టీని ప్రకటిస్తారో చూడాలి.