ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నీ కూడా అమ్ ఆద్మీ పార్టీ గెలుపొందు తుందని నిర్థారించడంతో ప్రధాన మంత్రి మోదీ హోంమంత్రి షా జాతీయ వాదానికి భారత దేశంలో నూకలు చెల్లినట్లే భావించాలి. 2019 సాధారణ ఎన్నికల్లో భావోద్వేగాలు రెచ్చ గొట్టి గెలుపు గుర్రం ఎక్కారు. అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటమి ఎదురౌతోంది.
2019 ఎన్నికల్లో గెలుపొంది బిజెపి అధికారంలోనికి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. పరిశ్రమలు మూత పడ్డాయి. నిరుద్యోగం వెర్రి తలలు వేసింది. కేంద్ర ప్రభుత్వం పూట గడిచేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు బియస్ యన్ యల్ యల్ ఐ సి లాంటి సంస్థలను ప్రైవేటు సంస్థల పరం చేయడం మొదలెట్టింది. మరో వేపు మతోన్మాదంతో కూడిన సిఎఎ యన్ సి ఆర్ లాంటి చట్టాలను పార్లమెంటులో వున్న మూక బలంతో దేశ ప్రజల నెత్తిన రుద్ది దేశ లౌకిక తత్వాన్ని ఖూనీ చేసే పరిస్థితి తెచ్చారు. ఈ దుర్మార్గమైన విధానాలే ఢిల్లీ ఓటర్ల తీర్పులో వ్యక్తం కానున్నది. ఈ ధోరణి ఎగ్జిట్ పోల్ లో ఓటర్ల నాడి వ్యక్తమైంది. రేపు ఇందుకు భిన్నంగా తీర్పు వచ్చే అవకాశం లేదు.
ఆ నాడు మహారాష్ట్రలో చిర కాలం బిజెపితో అంట కాగిన శివసేన గుడ్ బై చెప్పిందంటే మహారాష్ట్ర ఓటర్ల తీర్పు కూడా ఒక కారణం. అదే విధంగా హర్యానా తీర్పు బిజెపిని మట్టి గరిపించింది. 2019 ఎన్నికల తర్వాత బిజెపి జాతీయ వాదానికి క్రమేణా కాలం చెల్లిందనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల హవా మొదలైన నేపథ్యంలో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అప్ పార్టీ గెలుపొందుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం సంచలనంగా వుంది.
ఈ పరిణామాలు కేవలం బిజెపి మతోన్మాద విధానాల పరాజయంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలా కోరు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా వచ్చే తీర్పుగా భావించాలి.మరో వేపు పోలింగ్ కు మునుపే కాంగ్రెస్ పార్టీ కాడి ఫడేసిందని వార్తలు వచ్చాయి.బిజెపిని మట్టి గరిపించేందుకు కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బలహీన మైన అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా అప్ పార్టీకి సాయం చేసిందంటున్నారు. ఫలితంగా వంద సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ తనకు తను హననం చేసుకున్నదని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కు పరిమిత మైంది.
అయితే ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు అనాసక్తి ప్రదర్శించారు. సాయంత్రం 6 గంటలకు 58 శాతం మాత్రమే పోల్ అయింది. ఇక క్యూలో వుండే వారి గణాంకాలు తేలవలసి వుంది. 2015 ఎన్నికల్లో 67.14 శాతం అత్యధికంగా పోల్ కాగా 2013 లో 65.63 శాతం 2008 ఎన్నికల్లో 57.58 శాతం పోలింగ్ జరిగింది. వీటితో పోల్చుకుంటే ఈ దఫా తక్కువ పోలింగ్ జరిగినట్లే లెక్క. గమనార్హమైన అంశమేమంటే ఉదయం 10 గంటల వరకు 4.55 శాతం మాత్రమే పోల్ అయింది. మధ్యాహ్నం మీద పోలింగ్ ఊపు అందుకున్నందున ఆ మాత్రం పోలింగ్ శాతం పెరిగింది. 70 శాసన సభ స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోటీ ప్రధానంగా అప్ పార్టీ బిజెపి మధ్యనే జరిగింది.