అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఊహకందని రీతిలో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంది భాజపా. పలుసార్లు ప్రధాని మోడీయే స్వయంగా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అనడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ఇదే పద్దతిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రయోగించాలని చూస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నంలో బీజెపి ఉందని ఆరోపించారు.
గత ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోగా బీజెపీ 73 స్థానాలతో ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీజెపీ ప్రలోభాలకు పాల్పడుతోందని అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల ఆశజూపి ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తోందని, అది ఎంతమాత్రం సాధ్యంకాదని, పదవీ కాలం ముగిసేవరకు తామే అధికారంలో ఉంటామని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
కేంద్ర నాయకుల ఆదేశాల మేరకు మొదట రూ. 10 కోట్లు ఆశచూపి, ప్రభుత్వం పడిపోయిన తర్వాత రూ. 15 కోట్లు ఇస్తామని ఆశ చూపించారని పేర్కొన్న ఆయన బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, మార్కెట్లో మేకలను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని కరోనా మహమ్మారి కబళిస్తుంటే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలను చేస్తోందని దుయ్యబట్టారు, రాష్ట్రంలో బీజేపీ లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతోందని అన్న అశోక్ గెహ్లాట్ వారి ప్రయత్నాలను సాగనివ్వమని అన్నారు. మరి సీఎం ఆరోపణల పట్ల భాజపా ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.