‘పెద్దన్న’ రివ్యూ! – వద్దన్నా!!

రేటింగ్: 2.0/5.0

దర్శకత్వం : శివ

తారాగణం : రజనీ కాంత్, మీనా, ఖుష్బూ, నయన తార, కీర్తీ సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అభిమన్యూ సింగ్, సూరి, సత్యన్, సతీష్, వేలా రామ్మూర్తి, పాండ్యరాజన్ తదితరులు

రచన : శివ -ఆది నారాయణ, సంగీతం : డి ఇమాన్, ఛాయాగ్రహణం: వెట్రీ

బ్యానర్ : సన్ పిక్చర్స్,

సమర్పణ : కళానిధి మారన్

నిర్మాతలు (తెలుగు డబ్బింగ్) : డి సురేష్ బాబు, దిల్ రాజు, నారాయణ దాస్ నారంగ్

విడుదల : నవంబర్ 4, 2021

గ్లోబల్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తలైవర్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా, చెల్లెలి సెంటిమెంటు ‘పెద్దన్న’ – గత సంవత్సరం దీపావళికి రావాల్సింది ఈ దీపావళికి ముస్తాబైంది కోవిడ్ సౌజన్యంతో. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3 వేల థియేటర్లలో విడుదలైన ఈ మల్టీ స్టారర్ లో ముచ్చటగా ముగ్గురు సీనియర్ హీరోయిన్లతో బాటు ఒక తాజా హీరోయిన్ కొలువుదీరింది. మీనా, ఖుష్బూ, నయనతార ప్లస్ కీర్తీ సురేష్ లతో బోలెడు సంసారపక్ష గ్లామర్ షో. మరో ముగ్గురు విలన్లతో రజనీ యాక్షన్ హంగామా. తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’ మొదలైన సినిమాలు తీసిన యాక్షన్ – ఎమోషనల్ డ్రామాల దర్శకుడు శివకి తొలిసారిగా రజనీతో డైరెక్షన్. పెద్ద నిర్మాణ సంస్థ, తెలుగులో పెద్ద పంపిణీదార్లు – హంగూ ఆర్భాటం పండగకి తగ్గట్టు ఆకర్షణీయంగానే వుంది. థియేటర్లోకి వెళ్ళాక ఎలా వుంటుంది? చెల్లెలి సెంటిమెంటుతో, పెద్దన్న మమతాను రాగాలతో పండగని ఫీలవుతామా? రజనీ ఎప్పట్లానే పిల్లాపాపల్ని, యువ కెరటాల్ని, ముసలీ ముతకనీ తన మార్కు వినోద కాలక్షేపంతో రంజింపజేస్తాడా? ఇవీ తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు…

కథ

రాజోలులో పెద్దన్న అనే వీరన్న (రజనీకాంత్) పంచాయితీ పెద్ద. ఇతడికి కనకం అనే కనక మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ముద్దుల గారాల చెల్లెలు. ఈమెని కంటూ తల్లి చని పొతే చెల్లె పాపగా ప్రాణంలా పెంచి పెద్ద చేశాడు. చెల్లె పాపకి కూడా పంచ కట్టుకునే అన్నంటే పంచ ప్రాణాలు. ఇలా వుండగా ఓ కేసులో తను చెప్పినట్టు చేసిందని లాయరమ్మని (నయనతార) ప్రేమిస్తాడు పెద్దన్న. ఆమె కూడా ప్రేమిస్తుంది.

ఇంతలో ఇద్దరు పెళ్ళయిన మరదళ్ళు (మీనా, ఖుష్బూ) మమ్మల్ని నువ్వు పెళ్ళి చేసుకోకపోతే చేసుకున్న మొగుళ్ళతో మేమెలా అయ్యామో చూడమని వచ్చేసి గొడవ మొదలెడతారు. వీటన్నిటి మధ్య ఇక పెద్దన్నకి చెల్లెలి పెళ్ళి చేయాలన్పించి సంబంధాలు చూసి, ఓ పెద్దమనిషి (ప్రకాష్ రాజ్) కొడుకుతో పెళ్ళి వేడుకలు ప్రారంభిస్తాడు. తీరా పెళ్ళి సమయానికి చెల్లెలు కనకం చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళి పోతుంది. పెద్దన్న కంగారు పడతాడు. ఎంత వెతికినా కనపడదు కనకం. పెళ్ళి ఆగిపోతుంది. అలా మాయమై పోయిన కనకం కలకత్తాలో ప్రమాదంలో వుందని తెలుస్తుంది.

కనకం కలకత్తాలో ప్రమాదంలో ఎందుకుంది? ఎవరా ప్రమాదకారులు? ఇక పెద్దన్న కలకత్తా వెళ్ళి చెల్లెల్ని ఎలా కాపాడుకున్నాడు? ఇదీ రజనీ స్టయిల్ మిగతా కథ.

ఎలావుంది కథ

రజనీ అలసి పోలేదు, రజనీతో కథలు అలసి పోయాయి. అవే కథలు అలాగే తీసి తీసి రజనీని అపహాస్యం పాల్జేస్తున్నారు. రజనీలో సరుకు అయిపోలేదు, రజనీతో తీసే దర్శకుల్లో కొత్త సరుకు లేదు. రజనీ యాక్టింగ్ స్టయిల్ అదే హైరేంజి లో వుంటే, దాన్ని అందుకోవడంలో యువ దర్శకులుగా విఫలమై, లో- రేంజి ముసలి దర్శకత్వాలతో సరిపెడుతున్నారు. రజనీ వయసై పోయిందనే వాళ్ళు, యువ దర్శకుల వయసై పోయిందని భాష మార్చుకోవాల్సి వుంటుంది.

రజనీ ఎప్పుడో 30, 40 ఏళ్ళ క్రితం నటించేసిన కథల్లోంచి ఓ చెల్లెలి కథ తీసుకుని ఇప్పటి ప్రేక్షకులకి ఆ కాలపు తరహాలోనే ఉన్నదున్నట్టు అంటగట్టాడు దర్శకుడు శివ. భావోద్వేగాలు ఎప్పుడూ అవే వుంటాయి. వాటిని వ్యక్తం చేసే సినిమా నాటకీయత కాలాన్ని బట్టి మారుతుంది. ఇప్పటి ఏ సినిమాల్లో అన్నాచెల్లెలు దర్శకుడు శివ చూపించినట్టు వుంటున్నారు? ఇది కూడా సరి చూసుకోకూడదా?

పాత కథల్ని సినిమాలుగా తీయకూడదని కాదు. రీబూట్ చేసి, సమకాలీన కథలన్పించేలా తీయడానికి కూడా బద్ధకమైతే ఎలా? ప్రమాదంలో పడ్డ చెల్లెల్ని అన్న కాపాడాల్సిన అవసరం జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఎక్స్ పైరీ డేట్ వుండదు. కాలాన్ని బట్టి తీరు మారుతుంది. ఈ కాలీన స్పృహ కూడా లేకపోతే సినిమాలు తీయడమెందుకు?

ఈ కథ థీమ్ తో ఇబ్బంది లేదు. తీసిన విధానమే, పురాతన సినిమా చూస్తున్నట్టు వుంది. అన్నా చెల్లెల సెంటిమెంట్లు, వాళ్ళ సీన్లు, మాటలు, పాటలు, ఎడబాటులో కన్నీళ్ళూ ఏడ్పులూ… వీటికి తోడు రజనీ పెద్దరికపు గ్రామీణ దృశ్యాలు, కామెడీలు, గ్రామీణ విలనీ, కలకత్తా విలనీలూ… ఏదీ నేపథ్యాలు మార్చి కొత్తగా చూపించే బదులు 1980 ల, 90 ల నాటి సినిమా చూడమన్నట్టు చూపించేశాడు ఆలిండియా ప్లస్ ఓవర్సీస్ ప్రేక్షకులకి శివ!

నటనలు- సాంకేతికాలు

రజనీ రహస్యమేమిటంటే ఏ సినిమాలోనూ బరువెక్కకుండా అదే స్లిమ్ బాడీతో యాక్టివ్ గా వుండడం. ఈ సినిమాలో ఎక్కడా కుదురుగా వుండడు. ఏ సీనులో చూసినా స్పీడుగా నడిచి వచ్చేస్తూ డైలాగులు చెప్పేస్తాడు. తను మూవ్ మెంట్ లో వుండని క్షణం లేదు. తన వల్లే సీన్లు మొరాయించకుండా చకచకా పరిగెడుతూంటాయి. కాలం చెల్లిన కథనీ, పాత్రనీ ఓడించేస్తూ తన సమ్మోహనాస్త్రపు ఛత్రఛాయ కిందికి ప్రేక్షకుల్ని లాక్కొచ్చేస్తాడు. విలన్లనీ, వాళ్ళ ముఠాల్నీ తంతున్నప్పుడు మన ఉద్రేకాలు పెరిగేలా చేస్తాడు. తనకి అన్ని విద్యలూ తెలుసు. మందబుద్ధి మేకర్లే అర్ధం జేసుకోరు. ప్రతీ పాటా జనరంజకం చేసి పెట్టాడు. ఈ సినిమా కథని పూర్వజన్మ కర్మ ఫలమని భరిస్తూ ఏదో కాసేపు చూడాలన్పిస్తే – అది రజనీ గురించీ, సంగీత దర్శకుడు ఇమాన్ గురించే!

కీర్తి సురేష్ చెల్లెలి పాత్రా, నటనా కీర్తి శిఖరాలందుకునే ప్రమాదముంది. దీంతో ఇతర దర్శకులు ఆమెతో ఇలాటి ప్రయోగాలు చేసినా చేస్తారు. బారసాల నుంచి సీమంతం పాట వరకూ తనెక్కడికో వెళ్ళిపోయింది. ఇంత ప్రాచీన జీవితం ఆమెతో మనం చూడాలి. మధ్యలో పాత మోడల్ మరదళ్ళుగా మీనా, ఖుష్బూల విచిత్ర పాత్రలు, గోల కామెడీ నటనలూ సరే. నేటి సినిమా అంటే ఇలా వుండాలని ప్రేక్షకులకి నేర్పుతున్నాడు దర్శకుడు. మీనా, ఖుష్బూ లకి కూడా ఇదే కరెక్ట్ అన్పించి వుంటుంది. లాయర్ పాత్రలో నయనతార ఒక్కరే రజనీ తర్వాత కాస్త చూడదగ్గదిగా వుంటుంది. రజనీ- నయనల మధ్య ముందొక డ్యూయెట్ పెట్టేశాక, ఇంకా రోమాంటిక్ సీన్లు తలపోయలేదు ఎందుకో శివ.

విలన్ల గురించి- ఫస్టాఫ్ లో ప్రకాష్ రాజ్, సెకండాఫ్ లో జగపతిబాబు, అభిమన్యూ సింగ్ లు అత్యంత అర్ధం పర్ధం లేని విలన్ పాత్రలేశారు. చివరి ఇద్దరికీ కీర్తీ సురేష్ తో కుట్రకి కూడా సరైన కారణం కన్పించదు. బోలెడు హింసకి పాల్పడ్డమే విలనీ అనుకుంటే అదిక్కడ వర్కౌట్ కాలేదు, కనెక్టూ కాలేదు.

ఇక సంగీత దర్శకుడు ఇమాన్ గురించి. విషయపరంగా సినిమా ఎలా వున్నా, ఆరు పాటలు రజనీకి తగ్గట్టు ఇవ్వడంలో హిట్టయ్యాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కేం చేశాడు? ఇవాళ దీపావళి. టపాకాయలు హోరెత్తుతాయి. దీనికి పోటాపోటీగా అన్నట్టు సినిమా సాంతం లౌడ్ మ్యూజిక్ తో శబ్ద కాలుష్యం సృష్టించి పారిపోయేలా చేశాడు. ఈ సినిమా కెళ్తే ఇంటి కొచ్చి బాణసంచా కాల్చనవసరం లేదు. డబ్బులు ఆదా అవుతాయి.

నిర్మాణపరంగా బడ్జెట్ కి వెనుకాడలేదు. గ్రామీణ దృశ్యాలు, కలకత్తా దృశ్యాలూ హై రేంజిలో చిత్రీకరించారు. అలాగే యాక్షన్ దృశ్యాలూ. ఓ మూడు నాల్గు సీన్లు తప్పిస్తే, ఏ సీన్లోనూ కనిష్టంగా 50, గరిష్టంగా వందల మందికి తక్కువ కాకుండా క్రౌడ్ సీన్లే వుంటాయి. రజనీని కాసేపు ఒంటరిగా చూద్దామంటే కన్పించడు! ఇది సినిమానా, ఎలక్షన్ ర్యాలీనా అన్నట్టు తీశారు బడ్జెట్టంతా ధారబోసి!

చివరికేమిటి

ఈ రజనీ కొత్త సినిమా విడుదల ముందు అనుకున్నంత బజ్ క్రియేట్ చేయలేదు తమిళనాడులోనూ, మిగతా దేశంలోనూ. సోషల్ మీడియా స్తబ్దుగా వుండి పోయింది. యూత్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక మాస్ మసాలా సినిమాలకి దూరంగా ఆన్ లైన్లో వస్తున్న కొత్త కంటెంట్ కి అలవాటు పడుతున్నారేమో. తెలుగులో కూడా ఈ మధ్య మాస్ సినిమాలకి మాస్ ప్రేక్షకులే కరువయ్యారు. రివ్యూలు రాయడానికి మనం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల్ని చూస్తాం. అక్కడైతే అన్ని తరగతుల ప్రేక్షకుల రియాక్షన్ తెలుస్తూంటుంది. ఈ సినిమా మార్నింగ్ షోకి మాస్ తక్కువే వున్నారు. రజనీ కాబట్టి ఆ మాత్రం వచ్చి వుంటారు. వాళ్ళు ఈ పాత అతి మెలో డ్రామా సీన్లకి గట్టిగా నవ్వకుండా వుండ లేక పోయారు. నిజం కంటే న్యాయం గొప్పదని ఒక డైలాగు వుందిందులో. అరిగిపోయిన పాత చింతకాయ కథ అన్న నిజాన్ని దాచి పెడుతూ న్యాయం చేయాలని తెలుసుకోకుండా – దర్శకుడు రెండు దీపావళులు దివ్యంగా గడిపేశాడు…

—సికిందర్