చిత్రం: వకీల్‌సాబ్
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
నటీనటులు: పవన్ కళ్యాణ్, నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, శ్రుతిహాసన్, ముకేష్ రుషి
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్
సంగీతం: ఎస్.థమన్
రచన, దర్శకత్వం: శ్రీరామ్ వేణు
దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. ఇక పవన్ సినిమాలు చేయడని అనుకున్న అభిమానులు పవన్ రీఎంట్రీతో ఖుషీ అయ్యారు. కానీ ఎలాంటి సినిమా చేస్తాడనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది. ఆ డైలమాలో పవన్ ‘పింక్’ రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అక్కడ ఇంకొన్ని ప్రశ్నలు. సినిమా ఎలా ఉంటుంది, మునుపటిలా పవన్ పవర్ఫుల్ పాత్రలు చేస్తాడా అనే స్నెహాలు మొదలయ్యాయి. వాటికి సమాధానం చెబుతూ ‘వకీల్ సాబ్’ ఈరోజే విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..
పల్లవి, జరీనా, అనన్య అనే ముగ్గురు బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలు సిటీలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి వారి జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. రాజకీయవేత్త కొడుకు పల్లవి మీద లైంగిక దాడికి యత్నిస్తాడు. పల్లవి అతన్ని గాయపరుస్తుంది. ఆ తర్వాత ఆమెకు వేధింపులు ఎక్కువవుతాయి. అది తట్టుకోలేక ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పొలిటీషియన్ కొడుకు కూడ పల్లవి మీద అటెంప్ట్ టూ మర్డర్ కేస్ పెడతాడు. పల్లవి అరెస్ట్ అవుతుంది. బెయిల్ కూడ రాకుండా చేస్తారు. ఆ టైంలోనే వకీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) వారికి అండగా నిలుస్తాడు.
నాలుగేళ్లు కోర్టు నుంచి సస్పెండ్ అయిన సత్యదేవ్ ఆ ముగ్గురు అమ్మాయిలకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు ? సత్యదేవ్‌ను కోర్టెందుకు సస్పెండ్ చేస్తుంది ? చివరకు కోర్టులో పల్లవి, ఆమె స్నేహితులను సత్యదేవ్ ఎలా గెలిపించాడు ? అనేది సినిమా..
పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. అలంటి వ్యక్తిని డైరెక్ట్ చేయడమంటే చాలా లెక్కలు ఉంటాయి. ఎన్నో అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రెగ్యులర్ కమర్షియల్ హీరోగా చూపెడితే సరిపోదు. అలాగని కమర్షియల్ హంగులు తగ్గితే మొదటికే మోసం. ఈ చిన్న గీత మీద దర్శకుడు వేణు శ్రీరామ్ సరిగ్గా నిలబడ్డారు. అందరినీ సంతృప్తి పరిచేలా సినిమా చేశాడు. కథ పరంగా పవన్ లాయర్. ధర్మం కోసం పోరాడతాడు. నిస్సహాయలకు అండగా నిలుస్తాడు. జనం కోసం త్యాగాలు చేస్తుంటాడు. తన ఆశయానికి అడ్డొస్తే ఏ కీలుకి ఆ కీలు విరిచేస్తాడు. సో… ఇక్కడితో క్యారెక్టరైజేషన్ సెట్ అయిపోయింది. ఇక కథ కొంచెం రెగ్యులరే. కష్టాల్లో ఉన్న అమ్మాయిలు, వారిని కాపాడే లాయర్. సందేశం ఇస్తూనే కమర్షియల్ హంగులతో ఒక సినిమాను వండటానికి కావాల్సిన సామాగ్రి సమకూరింది.
ఇక అందులో సరిగ్గా కుదరాల్సిన మసాలా పవన్ కళ్యాణ్. మిగతా సినిమాల్లో పవన్ వేరు ఈ సినిమాలో పవన్ వేరు. మొదటిసారి లాయర్ పాత్ర చేసిన ఆయన ఆ పాత్రకు సరిగ్గా కుదిరిపోయారు. పంచ్ డైలాగ్స్ చెప్పకపోయినా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు. కోర్టు వాదనల సమయంలో పవన్ పెర్ఫార్మెన్స్ అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పవన్ ఎగ్జైట్ అయిన ప్రతిచోటా అభిమానులూ ఎగ్జైట్ అవుతారు. బయట హీరోకు ఎంత ఎలివేషన్ అయినా ఇవ్వొచ్చు. కానీ కోర్టులో అది కుదరదు. ఈ అడ్డంకిని వేణు శ్రీరామ్ చాలా తెలివిగా అధిగమించాడు. పవన్ మార్క్ మేనరిజమ్స్ బాగా వాడుకున్నాడు. ప్రత్యర్థి లాయర్ మీద వ్యంగ్యాస్త్రాలు వేయిస్తూనే ఆడవాళ్ళ గురించి మంచి మంచి మాటలు చెప్పించారు. ఆడవాళ్లను ఈ సమాజం ఎలా చూస్తోంది, కట్టుబాట్ల పేరుతో వాళ్లకు ఎలా సంకెళ్లు వేస్తోంది, అసలు ఆడవారి పట్ల మెజారిటీ మగవాళ్ళతో ఎలాంటి ఐడియాలజీ ఉంది పూసగుచ్చినట్టు చెప్పారు. అవి ప్రేక్షకుడ్ని ఆలోచింపజేస్తాయి.
వాదనల సమయంలో పవన్ కంట్రోల్ తప్పే సన్నివేశం అయితే గూస్ బమ్స్ తెప్పిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదరగొట్టారు. ఫస్టాఫ్ కొంచెం స్లోగానే సాగినా సెకండాఫ్ మాత్రం ఫుల్ టేకాఫ్ అందుకుంది. ఎక్కడా తగ్గలేదు. కేసు వాదనలు పెరిగే కొద్ది వకీల్ సాబ్ ఏం చేస్తాడు, ఎలా వాదిస్తాడు. ఏ లాజిక్స్ లాగుతాడు అనే ఉత్కంఠ నడిచింది. ప్రత్యర్థి తరపున వాదించే లాయర్ నంద పాత్రలో ప్రకాష్ రాజ్ నటన హైలెట్ అయింది. పవన్ నుండి అంత బలమైన పెర్ఫార్మెన్స్ బయటకు రావడానికి ప్రకాష్ రాజ్ నటన ప్రధాన కారణం. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. కోర్ట్ సీన్ ప్రతిదీ పండింది. కానీ ఫైట్స్ విషయంలోనే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. అన్ని ఫైట్స్ చుట్టేసినట్టే ఉంటాయి. సినిమా అయిపోయాక గుర్తిండిపోయే ఫైట్స్ ఒక్కటి ఉన్నా బాగుండేది.
ఇక పవన్ రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన డైలాగ్స్ రాజకీయంగా పవన్ ను అభిమానించే వారికి బాగా కనెక్ట్ అవుతాయి. జనానికి మీరు కావాలి. గెలుపోటములతో సంబంధం లేదు.. నాకు ఆశయమే ముఖ్యం. దేశంలో అడుక్కునే వాడికి అన్నం దొరకుతుంది.. కష్టపడేవాడికి నీడా దొరుకుతుంది… కానీ పేదోడికే న్యాయం దొరకడం లేదు. ఆశకు, భయానికి మధ్య ఊగిసలాడే బతుకులు వాళ్లవి.. వాళ్లకు నేను అండగా ఉంటాను అంటే మాటలు పవన్ రాజకీయ ఉద్దేశ్యాలను, లక్ష్యాలను బయటపెట్టడం కోసమే రాశారు. అవి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. లుక్స్ పరంగా పవన్ వయసు బయటపడినా ఆయనలో ఎనర్జీ మాత్రం తగ్గలేదు. థమన్ సంగీతం కీలక సన్నివేశాలకు అదనపు బలాన్ని చేకూర్చింది. మొత్తంగా అభిమానులను అలరించేదిగా ప్రేక్షకులను ఆలోచింపజేసేదిగా ఉన్న ఈ సినిమా పవన్ కు పర్ఫెక్ట్ రీఎంట్రీ అనొచ్చు.
బాటమ్ లైన్ : ‘వకీల్ సాబ్’ వాదనల్లో నెగ్గాడు