రవితేజ కొత్త చిత్రం ‘ఖిలాడీ’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ‘క్రాక్’ లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘ఖిలాడీ’ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక టీజర్ విషయానికొస్తే అందులో యాక్షన్ షాట్స్, రవితేజ లుక్స్ తప్ప వేరే ఏ అంశమూ కనబడలేదు. సాధారణంగా టీజర్ చూస్తే సినిమా మీద ఒక అంచనా అనేది రావాలి. సినిమా దేని గురించి, హీరో గోల్ ఏంటి, అతడి పాత్ర ఎలా ఉండబోతుంది అనేవి తెలియాలి. కానీ ‘ఖిలాడీ’ టీజర్లో అలాంటివేం బయటపడలేదు. కేవలం సినిమా లెవల్ ఏంటి, రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రమే చూపించారు.
దాదాపు నిముషం నిడివి ఉన్న టీజర్లో చివరి వరకు అన్నీ ఇవే కనబడతాయి. ఆఖరి ఐదారు సెకన్లలో మాత్రం ఇఫ్ యు ప్లే స్మార్ట్ వితవుట్ స్టుపిడ్ ఎమోషన్స్.. యుఆర్ అన్ స్టాపబుల్ అనే డైలాగ్ చెప్తాడు రవితేజ. ఆ ఒక్క డైలాగ్ మాత్రమే రవితేజ ఏదో రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నాడని కాస్త ఆసక్తి మొదలవుతుంది. మొత్తానికి ‘ఖిలాడీ’ టీజర్ ఆసాంతం ఏమీ అర్థంకాకపోయినా చివర్లో మాత్రం ఏదో కాస్తంత ఫీడింగ్ ఇచ్చినట్టు ఉంది. ఇది మాస్ మహారాజ అభిమానులకు కిక్ ఇస్తుందేమో కానీ ప్రేక్షకులకు మాత్రం ఏదో ఉన్నట్టే ఉంది కానీ ఏముందో చెప్పలేదే. మరీ ఇంత దాపరికం ఎందుకు అనే ప్రశ్నను మిగులుస్తుంది.