చిత్రం: ఏక్ మినీ కథ
నటీనటులు: సంతోష్ శోభన్, కావ్యా థాపర్, బ్రహ్మాజి
కథ-మాటలు: మేర్లపాక గాంధీ
దర్శకత్వం: కార్తిక్ రాపోలు
నిర్మాత: యూవీ క్రియేషన్స్
ఒక కుర్రాడి ప్రైవేట్ పార్ట్ సమస్య మీద తీసినా సినిమానే ఈ ‘ఏక్ మినీ కథ’. స్వాతి పుస్తకంలో వచ్చే సుఖ సంసారంలో ఒక పాఠకుడు అడిగిన ప్రశ్న నుండి ఈ కథను తయారుచేశారు మేర్లపాక గాంధీ. నిజానికి ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయడం కష్టమే. అందునా మన తెలుగులో అంటే మరీ కష్టం. ఏమాత్రం బెడిసికొట్టినా బూతు సినిమా అయిపోతుంది. ఈ ప్రమాదాన్ని కాచుకుంటూ కథను నడిపాడు దర్శకుడు కార్తిక్. కథానాయకుడు శోభన్ చిన్నప్పటి నుండి తన ప్రైవేట్ పార్ట్ చిన్నదిగా ఉండనే సమస్యతో మథనపడిపోతుంటారు. ఒక దశలో తనలో విషయం ఉందా లేదా అనేది తేల్చుకోవడానికి వ్యభిచార గృహానికి కూడ వెళ్తాడు. అంతటి మనోవ్యధను అనుభవిస్తుంటాడు హీరో. హీరోలోని ఆ బాధను ప్రేక్షకుడికి ఈజీగా అర్థమయ్యేలా చూపించారు. పాటలు, మాటలతోనే విషయం అర్థమైపోతుంది.
జీవితంలో అన్నీ చిన్నవే కలిగి ఉన్న హీరో అన్నీ పెద్దవే కావాలని కోరుకునే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడ హీరోని ఇష్టపడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో హీరో పెళ్లి చేసుకుంటాడు. తర్వాతి ఘట్టం శోభనం దగ్గరే కథ పాకాన పడుతుంది. హీరో ఆ విపత్కర పరిస్థితిని ఎలా దాటాడు, ప్రేమించి పెళ్లి చేయూస్కున్న అమ్మాయికి ఆ విషయం ఎలా చెప్పాడు అనేదే మిగతా కథ. నిజానికి ఈ కథ చిన్నదే. ఉన్నదల్లా ఒక్కటే విషయం.. అదే హీరోకి విషయం చిన్నది. సినిమాలోని చాలా సన్నివేశాలు ఇదే పాయింట్ మీద నడుస్తాయి. ఫస్టాఫ్ వరకు కథా పరిచయం, హీరో బాధలు, కామెడీ సీన్స్ అంటూ కాస్త సరదాగానే సాగిపోతుంది.
కానీ సెకండాఫ్ మాత్రం కొంత బోర్ కొట్టిందనే అనాలి. కొన్ని ఫోర్స్డ్ కామెడీ సన్నివేశాలు ఇబ్బంది కలిగిస్తాయి. సెకండాఫ్ మొత్తం హీరో శోభనాన్ని స్కిప్ చేయడానికి చేసే ప్రయత్నాలే. అది కాదు అంటే చిన్న పార్ట్ ను పెద్దది చేసుకోవడానికి హీరో పడే పాట్లు… ఇంతే. నిజానికి ‘ఉప్పెన’ సోల్ పాయింట్ కూడ దాదాపు ఇలానే ఉంటుంది. కానీ ఆ కథలో హృద్యమైన ప్రేమ కథ, వర్ణనాతీతంగా హీరో వ్యథ ఉంటాయి కాబట్టి ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. కానీ ఈ ‘ఏక్ మినీ కథ’లో అంత హృద్యమైన ప్రేమ కథ లేదు. సరదాగా లాగించెయ్యాలనే ప్రయత్నంలో సినిమా ఇంపాక్ట్ పడిపోయింది.
కానీ దర్శకుడు మాత్రం సినిమాను వల్గారిటీ, డార్క్ కామెడీ వైపుకు పడిపోకుండా కాపాడగలిగాడు. అలాగని ఈ సినిమాను స్మార్ట్ టీవీలకు కనెక్ట్ చేసేసి ఫ్యామిలీ మొత్తం ముఖ్యంగా చిన్న పిల్లలతో కలిసి చూడటం కష్టం. ఖాళీగా ఉంటే ఎవరికి వారు విడివిడిగా చూసుకోవాల్సిందే. మొత్తానికి ‘ఏక్ మినీ కథ’ ఓటీటీ వరకు సరిపోయే సినిమా. ఇదే చిత్రం థియేటర్లలో వచ్చి ఉండి ఫ్యామిలీస్ వెళితే కాస్త సరదా దొరికిన ఇబ్బంది తప్పేది కాదు.
బాటమ్ లైన్ : ఖాళీగా ఉంటే ప్రైవేటుగా చూడండి