నటీనటులు: రజనీకాంత్, నయనతార, సునీల్‌శెట్టి, నివేదా థామస్, ప్రతీక్ బబ్బర్, జస్టిన్ సర్ణ, నవాబ్ షా,
దిలీప్ టాహిల్, యోగిబాబు, తంబి రామయ్య, శ్రీమాన్ తదితరలు ప్రధాన తారాగణం,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్. మురుగదాస్,
నిర్మాత: అల్లిరాజా సుభాస్కరన్,
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్,
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
రిలీజ్ డేట్: 09-01-2020
రేటింగ్: 3.5
రజనీ తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. రజనీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. గత నాలుగు దశాబ్దాలుగా తనదైన స్టైల్స్‌తో , మేనరిజమ్స్‌తో వెండితెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. తన సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. ఏడుపదుల వయసులోనూ రజనీలో ఇంకా ఆ స్పార్క్ తగ్గలేదు. కానీ తన మార్కు బ్లాక్ బస్టర్‌ని మాత్రం ఆయన అందుకుని చాలా కాలమే అవుతోంది. మాస్టర్ మైండ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన `రోబో` తరువాత తలైవా ఆ స్థాయి హిట్‌ని సొంతం చేసుకోలేకపోతున్నారు. కొచ్చడయాన్ నుంచి పేట్ట వరకు రజనీమార్కు సినిమా రాలేదనే చెప్పాలి. ఆ లోటుని `దర్బార్` తో తీర్చబోతున్నాం అంటూ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ చాలా కాన్ఫిడెంట్‌తో చెప్పారు. 15 ఏళ్లుగా మురుగదాస్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూశాను. అది ఇప్పటికి కుదరింది. ఒక సినిమా సూపర్‌హిట్ కావాలంటే దానికి ఓ మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్ ఈ సినిమాకు జరిగిందని రజనీ కూడా గంటాపథంగా చెబుతున్నారు. ఆయన నమ్మకానికి తగ్గట్టే `దర్బార్` వుందా? తలైవా నుంచి బ్లాక్ బస్టర్ హిట్‌ని, రజనీమార్కు మ్యాజిక్‌ని కోరుకుంటున్న అభిమానులకు `దర్బార్` ట్రీట్ ఇవ్వనుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) ముంబై అసిస్టెంట్ పోలీస్ కమీషనర్. ముంబైలో వున్న గ్యాంగ్‌స్టర్స్‌ని ఏరిపారేస్తుంటాడు. ఈ క్రమంలో బ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా అతని పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తూ వుంటుంది. తనదైన స్టైల్లో క్రిమినల్స్‌ని అంతం చేయడం ఆదిత్య అరుణాచలం స్టైల్. చట్టం చెప్పినట్టుగా కాకుండా తన మనస్సాక్షి ఏది చెబితే అది చేస్తూ ముంబై నగరంలోని గ్యాంగ్‌స్టర్స్‌కి సింహస్వప్నంగా నిలుస్తారు. ఆదిత్య అరుణాచలం ఎందుకు వరుస ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నాడు?. దాని వెనకున్న అసలు రహస్యం ఏమిటి? నివేదాథామస్‌కు, ఆదిత్య అరుణాచలంకు ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ ఆమె ఆదిత్య అరుణాచలంకు ఏమౌతుంది?. ముంబై డ్రగ్ మాఫియా కింగ్ (సునీల్‌శెట్టి)ని ఆదిత్య అరుణాచలం ఎందుకు టార్గెట్ చేశాడు? వీరిద్దరి మధ్య వున్న రైవర్లీకి కారణం ఎవరు? తనకు ఛాలెంజింగ్‌గా మారిన కిడ్నాప్ కేస్‌ని ఆదిత్య అరుణాచలం ఎలా పరిష్కరించాడు? చివరికి డ్రగ్ మాఫియా కింగ్ కథని ఎలా ముగించాడన్నదే అసలు కథ.
నటీనటుల నటన:
రజనీ మార్కు మేనరిజమ్స్, స్టైల్స్‌ని చూసి ఎంజాయ్ చేయాలని ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. `రోబో` తరువాత ఆ మార్కు రజనీ మెరుపులు కనిపించలేదు. అయితే అవన్నీ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు రజనీ. బ్యాడ్ కాప్‌గా ముంబైని హడలెత్తించే రౌడీ పోలీస్ కమీషనర్‌గా ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. స్టైల్స్‌కి, మేనరిజమ్స్‌కి ఇండియన్ సినిమా సిల్వర్ స్క్రీన్‌పై రజనీది చెరగని సంతకం. ఆయన స్టైల్‌ని మరిపించే హీరో ఇప్పటి వరకు రాలేదంటే రజనీ మేనియా ఏ స్థాయిలో వుందనేది అర్థం చేసుకోవచ్చు. ఆద్యంతం మైండ్‌గేమ్స్‌తో సాగిన ఈ సినిమాని రజనీ స్టైల్స్, డైలాగ్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా చేశాయి. గత చిత్రాలతో పోలిస్తే రజనీ ఈ సినిమాలో చాలా యంగ్‌గా, మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఒక విధంగా ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కి ఓ పండగే అని చెప్పాలి. నయనతార పాత్ర గురించి చెప్పుకోవడానికి ఇందులో పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి ఈ చిత్రంలో విలన్‌గా డ్రగ్ మాఫియా డాన్‌గా కనిపించారు. రజనీ, సునీల్‌శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సునీల్‌శెట్టి కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నివేదా థామస్ ఇందులో కథకు కీలక మైన పాత్రలో నటించింది. యోగిబాబు, తంబిరామయ్య, ప్రీతీక్ బబ్బర్, జస్టిన్ సర్ణ, నవాబ్ షా, దిలీప్ టాహిల్, శ్రీమాన్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
భారీ చిత్రాల కెమెరామెన్ సంతోష్‌శివన్ ఫొటోగ్రఫీ సినిమా లుక్‌ని మార్చేసింది. ప్రతీ ఫ్రేమ్‌ని చాలాగ్రాండీయర్‌గా చూపించారు. తలైవా రజనీ వయసుని తగ్గించి స్టైలిష్‌గా, యంగ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా విషయంలో అక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. `పేట్ట` తరువాత రజనీతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. పాటలు, నేపథ్య సంగీతం అదరగొట్టాడు. ముఖ్యంగా నేపథ్య సంగీతం, బీజియంస్ బాగున్నాయి. సీనియర్ మోస్ట్ ఎడిటర్, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రిస్పీ ఎడిటింగ్‌తో జెలక్‌లతో అదరగొట్టేశారు. మొదటి నుంచి భారీ నిర్మాణ విలువలతో సినిమాల్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఏ విషయంలోనూ రాజీపడకుండా సినిమాని లావిష్‌గా నిర్మించిన తీరు ఆకట్టుకుంటుంది. లైకా నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సామాజిక అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని సినిమా చేసే మురుగదాస్ ఈ సినిమా విషయంలోనూ ఇండియాలో బర్నింగ్ ప్రాబ్లమ్‌గా మారిన మహిళల వేధింపులు, హెరాష్‌మెంట్‌ని ప్రధానంగా తీసుకుని ఎక్కడ నేరం జరిగితే అక్కడే అదే స్థాయిలోనే పనిష్ చేయాలనే సందేశంతో ఈ చిత్రాన్ని మలిచారు. అందుకు రజనీ ఇమేజ్‌ని కూడా వాడుకుని కొత్త స్టైల్‌లో పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా ఈ చిత్రాన్ని మలిచిన తీరు రజనీ ఫ్యాన్స్‌తో పాటు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. రజనీని స్టైలిష్ రౌడీ కాప్‌గా ఆవిష్కరించడంలో మురుగదాస్ నూటికి నూరు శాంతం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కథ కొత్తగా లేకపోయినా రజనీ స్టైల్స్, మేనరిజమ్స్, డైలాగ్స్‌తో ఆ లోటు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. మాసీవ్ ఎలివేషన్స్‌తో రజనీని చూపించిన తీరుకు థియేటర్లలో విజిల్స్ పడటం గ్యారంటీ. ఓవరాల్‌గా చెప్పాలంటే చాలా కాలంగా రజనీ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి పక్కా పైసా వసూల్‌మాస్ మసాలా ఎంటర్‌టైనర్ `దర్బార్`. గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న తలైవర్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయినట్టే.
Rajinikanth’s Darbar movie released today with much fanfare. Fans are awaiting it’s the review. TeluguRajyam is presenting Darbar Full movie Review