ఓ విజువల్ వండర్!
ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ (అవతార్ 2) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పదమూడేళ్ల తర్వాత ‘అవతార్’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేశాయి. ఒక సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఏళ్ల తరబడి ఎదురుచూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ చిత్రమే ‘అవతార్ 2’. ఈ చిత్రానికి సంబంధించిన మొదటిభాగం 2009లో వచ్చి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడిని ఊపిరాడకుండా చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి రికార్డుల్ని చించేసింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ విజన్ కు ఉన్న శక్తి ఏపాటిదో ప్రేక్షకుల కళ్ళకు కట్టింది. ఒకటా..రెండా.. ఎన్నని చెప్పుకుందాం.. ఈ ‘అవతార్’ సృష్టించిన రికార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి. తొలి భాగానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ మలిభాగం కోసం ఎదురుచూడమని ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రెకెత్తించాడు. ఇక ‘అవతార్’ సీక్వెల్ రావడం ఖాయమని ప్రేక్షకులు అప్పుడే డిసైడ్ అయిపోయారు.. అప్పటినుంచి ఈ ‘అవతార్’కు ద్వీతీయ భాగం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూశారు. వాళ్ల ఎదురుచూపులకు సమయం రానేవచ్చింది. ‘అవతార్’ విడుదలైన దాదాపు పదమూడేళ్లకు ‘అవతార్: ద వే వాటర్’ థియేటర్లో అలజడి సృష్టించేందుకు.. ప్రేక్షకుల్ని మరోసారి ఊహాలోకాల్లోకి తీసుకెళ్లేందుకు మనముందుకొచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో విడుదలైన ‘అవతార్’ సినిమా సినీ అభిమానుల్ని మరో లోకంలో విహరింపజేసింది. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు పదమూడేళ్ల తర్వాత ‘అవతార్’ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు జేమ్స్ కామరూన్. 2009లో విడుదలైన అవతార్ సినిమా కామెరూన్ అద్భుత సృష్టికి నిదర్శనంగా నిలిచింది. గ్రాఫిక్స్, ఫాంటసీ సినిమాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అవతార్ ఎన్నో గొప్ప సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ వెండితెరపై అద్భుతాలు సృష్టించడంలో సిద్ధహస్తుడైన జేమ్స్ కామెరూన్ దాదాపు పదమూడేళ్ల తర్వాత అవతార్ సీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అవతార్ పెద్ద విజయాన్ని సాధించడంతో ఈ సీక్వెల్‌పై వరల్డ్ వైడ్‌గా సినీ అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అండర్ వాటర్ కథతో రూపొందిన అవతార్ 2 ఇంగ్లీష్, తెలుగు, తమిళంతో పాటు భారతీయ భాషలన్నింటిలో ఈ శుక్రవారం (16 డిసెంబర్-2022) విడుదలైంది. మరి ప్రేక్షకుల్ని ఇంతగా ఎదురుచూసేలా చేసిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతి కలిగించింది? తొలి భాగం లాగే ఉందా?, లేక అంతకంటే బాగుందా? అన్నది తెలుసుకుందాం…
కథేంటో చూద్దాం…
తొలిభాగం ఎక్కడ పూర్తయిందో అక్కడినుంచే ఈ కథ మలిభాగం ప్రారంభమైంది. పండోరా గ్రహంపై నుంచి మనషుల్ని వెళ్లగొట్టిన నావి తెగ ప్రజలు ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తుంటారు. కొంతమందిని మాత్రం ఇట్టే అంటిపెట్టుకునివుంటారు. ఎందుకంటే వాళ్లు నమ్మకస్తులైన మనుషులని వారి విశ్వాసం. హీరో జేక్ సల్లీ (శామ్ వర్తింగ్టన్), నేతిరికి ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి పుడుతుంది. తొలిభాగం చివర్లో మరణించిన డాక్టర్ గ్రేస్ జీన్స్ ఆధారంగా ఓ అవతార్ ని ల్యాబ్ లో సృష్టిస్తారు. దానికి కిరి అనే అమ్మాయి పుడుతుంది. ఈమెని కూడా జేక్ కుటుంబం దత్తత తీసుకుంటుంది. అలా నలుగురు పిల్లలతో జేక్ ఫ్యామిలీ పండోరాలోని హలలూయి మౌంటైన్స్ లో ఎంతో ఆనందంగా బతుకుతుంటారు. అలా హాయిగా ఉన్న సమయంలో ఓ రాత్రి ఆకాశ వాసులు (మనుషులు) మళ్లీ పండోరాపై తిరిగొస్తారు. తొలిభాగంలో చనిపోయిన ఆర్మీ కల్నల్ మైల్స్ జ్ఞాపకాలను భద్రపరిచి ఓ అవతార్ ని క్రియేట్ చేస్తారు. వీడు.. జేక్, అతడి భార్య నేతిరిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. వీరికోసం వెతుకుతుంటాడు. ఒక సమయంలో ఎట్టకేలకు జేక్ పిల్లలు.. మైల్స్ బృందానికి దొరికిపోతారు. అయితే.. జేక్-నేతిరి కలిసి పిల్లల్నిఎంతో చాకచక్యంగా వాడి బారినుంచి కాపాడుతారు. అమ్మో.. ఇక తామున్న చోటు సేఫ్ కాదని అనుకుని మెట్కాయన్ గ్రామానికి వలసపోయి అక్కడే సముద్రవాసుల్లో ఒకరిగా కలిసిపోతారు. మరి మైల్స్ బృందం జేక్ ఫ్యామిలీపై పగ తీర్చుకుందా? ఇంతకీ చివరికి ఏం జరిగింది? అన్నదే అసలుసిసలైన క్లయిమాక్స్! ఈ విషయాలన్నీ తెలియాలంటే థియేటర్లోకి అడుగుపెట్టాల్సిందే.. సినిమా చూడాల్సిందే..!
విశ్లేషణ :
అవతార్ పార్ట్ వన్‌ను గ్రాఫిక్స్, మోషన్ క్యాప్చర్ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలకు అధికంగా ప్రాముఖ్యతనిస్తూ రూపొందించారు జేమ్స్ కామెరూన్. సీక్వెల్‌ను మాత్రం అందుకు భిన్నంగా పూర్తిగా ఎమోషనల్ రైడ్‌గా సాగుతుంది. జాక్ ఫ్యామిలీ బాండింగ్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు డైరెక్టర్. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి జాక్ పడే తపన, సంఘర్షణ భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. అంతర్లీనంగా జాక్ ఫ్యామిలీపై క్వారిచ్ పగను పెంచుకోవడం, వారిని అన్వేషిస్తూ సాగించే ప్రయాణాన్ని ఉత్కంఠభరితంగా చూపించారు. కథగా చెప్పుకుంటే అవతార్ -2 రెగ్యులర్ రివేంజ్ డ్రామా. ఈ రొటీన్ పాయింట్‌ను గ్రాఫిక్స్‌తో విజువల్ ఫీస్ట్‌గా దర్శకుడు మలిచారు. రీఫ్ ఐలాండ్ బ్యాక్‌డ్రాప్, అక్కడి జంతువులు, మనుషులతో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు జేమ్స్ కామెరూన్. ఆ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. రీఫ్ ఐలాండ్‌లోకి ప్రేక్షకుల్ని తీసుకెళతాయి. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. చివరలో వచ్చే సీన్స్ కొంత జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమాను గుర్తుచేసినట్లుగా అనిపిస్తాయి.
ఈ సినిమాలో ఓ వైపు యాక్షన్ సీన్స్, మరోవైపు వండర్ ఫుల్ వాటర్ విజువల్స్..
మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే రెండు యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. జేక్ సల్లీ కుటుంబంతో పాటు, మెట్కాయన్ ప్రజలు కలిసి చేసే పోరాటంలో టుల్కూన్ అనే తిమింగళం లాంటి సముద్ర జీవి పాత్ర కూడా సూపర్ గా అనిపిస్తుంది. దాన్ని జేమ్స్ కామెరూన్ డిజైన్ చేసిన విధానం కూడా సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. తొలిభాగంలో కనిపించిన జేక్, అతడి భార్య నేతిరి ఈ సీక్వెల్ లో అంతే అద్భుతంగా నటించారు. వాళ్ల పిల్లలుగా నటించిన నలుగురు కూడా యాక్టింగ్ తో ఇరగదీశారని చెప్పొచ్చు. ముఖ్యంగా దత్తత తీసుకున్న అమ్మాయి కిరి, చిన్న కొడుకు క్యారెక్టర్స్ వల్లే సినిమా మొత్తం టర్న్ అవుతుంది. ‘అవతార్’ రోల్ లో కనిపించిన మైల్స్ కూడా బాగా చేశాడు. జేక్ ఫ్యామిలీకి సహాయపడే మిగిలిన పాత్రలన్నీ కూడా ఒకే అనిపిస్తాయి. ఇక సినిమాలో ‘స్పైడర్’ అనే మనిషి పాత్ర కూడా ఉంటుంది. జేక్ ఫ్యామిలీలో ఒకరిగా కలిసిపోయిన మనోడు.. అసలు ఎవరు ఏంటనేది మాత్రం సస్పెన్స్. మీరు సినిమా చూస్తే అతడి క్యారెక్టర్ కూడా మీకు భలే నచ్చేస్తుంది. ఈ సినిమా తొలి భాగం చూసిన వాళ్లకు సీక్వెల్ అంతగా ఏం అనిపించదు. ఎందుకంటే కథ పరంగా ఒకేలా ఉంటుంది. అయితే.. తొలిభాగం కూడకుండా వెళ్లే ప్రేక్షకులకి ఈ సీక్వెల్ అస్సలు అర్థం కాదు. ‘అవతార్’ మొదటిభాగం మామూలు కథగానే తెరకెక్కింది. పండోరాలో దొరికే ఉనబ్టేనియం అనే విలువైన ఖనిజాన్ని దక్కించుకోవడానికి మనుషులు ఆ గ్రహంపైకి వెళ్తారు. అక్కడ నివసించే నావి ప్రజలు దానికి ఏ మాత్రం ఒప్పుకోరు. వారి మధ్య చిలికి చిలికి గాలివానలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవతో ఆగకుండా చివరికి యద్ధానికి దారితీస్తుంది. గన్స్, యుద్ధ ట్యాంక్స్, అంత బలగం.. ఎన్ని ఉన్నా సరే నావి ప్రజలే చివరకు విజయం దక్కించుకుంటారు .ప్రమాదకరమైన మనుషుల్ని భూమ్మీదకు పంపించేస్తారు. తొలిభాగంలో పండోరా చూపించే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. అలా..ప్రారంభమై జేక్ ఫేస్ చూపించడంతో పూర్తవుతుంది. ఇప్పుడు తాజాగా విడుదలైన సీక్వెల్ లోనూ సేమ్ షాట్స్ ఉంటాయి. జేమ్స్ కామెరూన్ దీన్ని సింబాలిక్ గా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. తొలిభాగంలో మైల్స్ ని చంపేశారు. దీంతో సీక్వెల్ లో విలన్ ఎవరు అయ్యింటారా? అని డౌట్ వస్తుంది. కానీ.. మనోడు ఇక్కడా ఉంటాడు. తొలిభాగంతో పోలిస్తే మాత్రం అతడి క్యారెక్టర్ నార్మల్ గా అనిపిస్తుంది. ఇక మొదటి భాగంలో గాల్లో ఎగరడానికి ఇక్రాన్ అనే పక్షులు ఉంటాయి. ‘అవతార్ 2’లో ఈలు అనే సముద్ర జీవులు ఉంటాయి. జేక్ సల్లీ అండ్ ఫ్యామిలీ..నీటిలో ఈలుని మచ్చిక చేసుకునే సీన్స్ విజువల్ గా చక్కగా అనిపిస్తాయి. అయితే ఫస్టాప్ అంతా కూడా కథ సెట్ చేసుకోవడానికి సరిపోయింది. దీంతో సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. సముద్ర జీవుల్లో ఒకరిగా కలిసిపోయిన జేక్ కుటుంబానికి.. ప్రతిసారి కూడా చిన్న కొడుకు వల్లే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఫస్టాప్ బోరింగ్ గా అనిపించొచ్చు కానీ సెకండాఫ్ మాత్రం ఆసక్తిగా పరుగెడుతుంది. ముఖ్యంగా దర్శకుడు.. నిర్మాత.. ఎడిటర్ అయిన జేమ్స్ కామెరూన్ గురించి ఎంతో చెప్పుకోవాలి. సినిమాని ఆయన ఇష్టంగా.. ప్రేక్షకులు చక్కటి అనుభూతి పొందేలా రూపొందించారు. అది ప్రతి ఫ్రేమ్ లోనూ మనకు కనిపిస్తుంది. గ్రాఫిక్స్ తొలిభాగానికి మించిన స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్ అందించిన సిమోన్ ఫ్రాంగ్లన్ కొన్ని చోట్ల అద్భుతాన్ని సృష్టించారు. .ఈ చిత్రానికి చేసిన సాంకేతిక నిపుణులు పనితీరు వాహ్.. అనిపించేలా సాగింది. మొత్తం మీద సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులకు ‘అవతార్ 2’ అన్ని విధాలా నచ్చితీరుతుంది. ఓ విజువల్ ట్రీట్ లా అవతార్ 2 ని చెప్పొచ్చు. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. థియేటర్లో వ్ సినిమా చూస్తే కలిగే అనుభూతే వేరు! మరి ఎందుకు ఆలస్యం.. ‘అవతార్: ద వే వాటర్’ కోసం థియేటర్లో అడుగుపెడదాం!
Rating:4.2/5