విలన్స్ ఫుల్ – విషయం నిల్ : ‘సాహో’ మూవీ రివ్యూ!
బాహుబలి రెండు భాగాల వైభవం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాతి మూవీ ‘సాహో’ వైభవం కోసం ప్రపంచం కళ్ళు కాయలు జేసుకుని ఎదురు చూసింది. లెక్కలేనన్ని ప్రొడక్షన్ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎక్సైట్ అయ్యింది. ఫుల్ మజా ఈ వార్తల్లోంచి జుర్రుకుంటూ అసలు మజా అయిన సినిమా కోసం ఉవ్వీళ్ళూరింది. కేవలం తెలుగు సినిమా అన్పించుకోకుండా, పాన్ ఇండియా మూవీగా నాల్గు భాషల్లో ముస్తాబవుతున్న ‘సాహో’ పట్ల ఓహో అనుకుంటూ ప్రేక్షక ప్రపంచం ఇక వీక్షించడానికి సిద్ధమయింది. రెండు వందల కోట్ల రూపాయల దోపిడీ కథని 350 రూపాయల కోట్ల బడ్జెట్ తో తీయడాన్ని గర్విస్తూ పొద్దున్నే థియేటర్ల బాట పట్టింది. పట్టాక పెట్టుకున్న ఆశలు నెరవేరాయా? గజానికో గాంధారి కొడుకు అన్నట్టు అడుక్కో విలన్ కన్పించే ఈ అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్ లో, సూపర్ యాక్షన్ హీరోగా ప్రభాస్ ని చూసి ఫిదా అయ్యారా? ఈ విషయాలు పరిశీలిద్దాం…
కథ
ముంబాయిలో రెండువేల కోట్ల రూపాయల భారీ హై ప్రొఫైల్ దోపిడీ జరుగుతుంది. దోపిడీ దారులెవరో తెలీదు. ఎలా పట్టుకోవాలో తెలీదు. పోలీసులు డేవిడ్ – గోస్వామిలు (మురళీశర్మ, వెన్నెల కిషోర్) తలలు పట్టుకుంటారు. దీంతో అశోక్ చక్రవర్తి (ప్రభాస్) సీనులోకి వస్తాడు. ఇతను అండర్ కవర్ ఏజెంట్. తన మేధస్సు తో జై (నితిన్ నీల్ ముఖేస్) అనే వాణ్ణి కనిపెట్టి ఇన్ఫర్మేషన్ లాగుతాడు. వాజీ నగరంలో దాచిపెట్టి ఒక బ్లాక్ బాక్స్ వుందనీ, అది దొరికితే తాను రిచ్ అయిపోతాననీ చెప్తాడు జై. ఇలా వుండగా అశోక్ కి సాయపడ్డానికి క్రైం బ్రాంచ్ నుంచి అమృతా నాయర్ (శ్రద్ధా కపూర్) వస్తుంది. ఈమెని ప్రేమిస్తూంటాడు అశోక్. గతంలో రాయ్ (జాకీ ష్రాఫ్) అనే ఒక కరీం సిండికేట్ బాస్ హత్య జరుగుతుంది. ఆ హంతకుల కోసం అతడి కొడుకు విశ్వాంక్ (అరుణ్ విజయ్) వేటలో వుంటాడు. ఇప్పుడు ఈ దోపిడీతో రాయ్ కున్న సంబంధ మేమిటి? బ్లాక్ బాక్స్ తో వున్న మిస్టరీ ఏమిటి? అసలు అశోక్ ఎవరు?…ఇవీ తేలాల్సిన ప్రశ్నలు.
ఎలావుంది కథ
ఈ సినిమాలో ఒక డైలాగు వుంది : ప్రభాస్ ని ఉద్దేశించి, ‘కంటెంట్ బావుంది…యాక్షనే డిస్టర్బింగ్ గా వుంటుంది’ అని మురళీ శర్మ అంటాడు. దీన్ని తిరగేసి ‘కంటెంట్ డిస్టర్బింగ్ వుంది …యాక్షన్ బావుంది’ అనుకుంటే ఈ మూవీకి మ్యాచ్ అవుతుంది. ఏదో గడబిడ వున్నప్పుడే దర్శకులు ఇలా తమ టాలెంట్ గురించి గొప్పలు చెప్పించుకుంటారు పాత్రల చేత. ఫ్లాపయిన ‘రణరంగం’ ఇంటర్వెల్లో కథ ఖూనీ అయిపోవడంతో కాజల్ అగర్వాల్, హెల్ప్! హెల్ప్! అని ఎలా అరిచిందో తెలిసిందే. ఇంకేదో ఫ్లాపయిన సినిమాలో ‘ఇంటర్వల్ అదిరింది… ఇక సెకండాఫ్ స్క్రీన్ ప్లే వుంటుందీ…’ అని కమెడియన్ చేత బాజా వాయించుకుంటాడు దర్శకుడు. తర్వాత బయ్యర్లకి ఏం చెప్పుకున్నాడో?
అసలు విషయమేమిటంటే, ఇది హై కాన్సెప్ట్ కథ. హై కాన్సెప్ట్ కథల్లో సంఘటన భారీగా వుంటుంది, దాంతో కథనం బిగ్ యాక్షన్ తో ఆశ్చర్య పరుస్తూ సింపుల్ గా వుంటుంది. టైటానిక్, ట్రూ లైస్, టర్మినేటర్, ఇండిపెండెన్స్ డే, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, ఫాస్ట్ అండ్ ఫ్యూరీ సిరీస్ యాక్షన్ సినిమాలు మొదలైనవి ఈ కోవలోనే వుంటూ సూపర్ హిట్టవుతున్నాయి. కానీ ఒక సినిమా దర్శకుడు (రన్ రాజా రన్) అయిన సుజీత్ మాత్రం ఈ సూక్ష్మం తెలుసుకోక, ‘సాహో’ ని సహన పరీక్షగా మార్చాడు. భారీ సంఘటనకి భారీ బడ్జెట్ కాబట్టి అన్నట్టు, భారీ యాక్షన్ కి భారీ కథగా అన్పించాలని, అడుక్కో విలన్ తో భారీ ట్విస్టులు పెట్టేసి, గందరగోళం చేశాడు. ఇది చాలా విచారకరం. హాలీవుడ్ రేంజిలో యాక్షన్ సీన్స్ తీసినంత మాత్రాన అంతర్జాతీయ సినిమా అయిపోదు. అందులో విషయం పట్ల కామన్ సెన్స్ కూడా వుండాలి. భారీ సంఘటన + సింపుల్ కథనం + బిగ్ యాక్షన్ = బాక్సాఫీసు సెన్స్.
ఇంకోటేమిటంటే, దీనికి మార్కెట్ యాస్పెక్ట్ లేదు. ప్రభాస్ వున్నంత మాత్రాన మార్కెట్ యాస్పెక్ట్ అవదు. కంటెంట్ తో ఈ కథకి ఎకనమిక్స్ జతపడాలి. రెండు వేల కోట్లు ప్రేక్షకులకి అందుబాటులో వుండే ఎకనమిక్స్ అవదు. అదొక డ్రీమ్ మాత్రమే. ఎకనమిక్స్ ని మార్కెట్ యాస్పెక్ట్ కి తీసుకు రావాలంటే, ప్రభాస్ క్యారక్టర్ కి దాని తాలూకు ఎమోషన్ వుండాలి. క్యారక్టర్ కి చివరికి రొటీన్ రివెంజి అన్నట్టు ఎమోషన్ బయటపడ్డాక, అది రియలిస్టిక్ అప్రోచ్ కాలేకపోయింది…ఇలా ఈ కథలో స్క్రీన్ ప్లే ఎక్కడుందో కూడా అర్ధంగాకుండా పోయింది.
ఎవరెలా చేశారు
సూపర్ యాక్షన్ హీరోగా ప్రభాస్ మేకోవర్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి చాలా హైలైటే. కార్డియో వాస్క్యులర్, వెయిట్, పాలిమెట్రిక్ అబ్స్టకిల్స్ రేసులు మొదలైన వాటిలో కఠోర శిక్షణ పొంది బాల్డీ బిల్డింగ్ చేశాడు. అయితే వీటితో అలసట మోహంలో బయటపడకపోలేదు. దీనికి తోడూ ఫస్టాఫ్ లో ఫాస్ట్ అయిన, హుషారైన క్యారక్టరైజేషన్, నటన లేవు. సెకండాఫ్ లో వేగం పెరిగినప్పటికీ, ట్విస్టు మీద ట్విస్టుల దొంతరలో క్యారక్టరే దెబ్బతింది. జస్ట్ ప్రభాస్ కిది చేదు అనుభవం.
హీరోయిన్ శ్రద్ధా కపూర్ డిటో. విలన్స్ అందరూ డిటో. కంటెంట్ కుదరనప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్ లెవరూ సినిమాని నిలబెట్టలేరు. ఆస్ట్రేలియా, అబూ ధబీ, దుబాయి, యూరప్, రోమానియాలలో షూట్ చేసిన దృశ్యాలు కనువిందుగా వున్నాయి మాదీ కెమెరా వర్క్ లో. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ కూర్చిన యాక్షన్ కొరియో గ్రఫీ దృశ్యాలు చావుకి తెగించినట్టున్నాయి. ఈ కసి దర్శకుడికి కథతో కూడా వుండుంటే బావుండును. శంకర్ -ఎహె సాన్ -లాయ్ పాటలకి ప్రేక్షకులకి హుషారొచ్చింది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు.
చివరికేమిటి
ఫస్టాఫ్ ప్రారంభంలో మాఫియా ఎపిసోడ్ సుదీర్ఘంగా సాగడం, ప్రభాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ సుదీర్ఘంగా సాగడం, డైనమిక్స్ నే దెబ్బ తీశాయి. కథ చక చక సాగదేమిటన్న ఫీలింగ్ ఇలా మొదటినుంచే కలిగించారు. వీటి తర్వాత రెండు వేల కోట్లకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇంకో నత్త నడక వ్యవహారం, దీని మధ్య మధ్యలో లవ్ ట్రాక్ మరో స్లో వ్యవహారం. ఇలా గంట దాటేవరకూ ఒక మెగా బడ్జెట్ మూవీ చూస్తున్న ఫీలింగే కలగదు. సడెన్ గా ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ ఆపరేషన్ మొదలెట్టి, ప్రభాస్ క్యారెక్టర్ సాహో అంటూ రొటీన్ ట్విస్టే ఇచ్చారు.
ఇక సెకండాఫ్ విలన్స్ తో ట్విస్టులే ట్విస్టులు. వీటిని ఫాలో అవడం చాలా కష్టమైపోతుందని దర్శకుడు గుర్తించలేదు. ఇక యాక్షన్ సీన్స్ వస్తూంటే ప్రభాస్ ఎప్పుడు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడో పట్టుకోవడమూ కష్టమే. పైగా ప్రభాస్ పాత్రకి ఎమోషనల్ ట్రావెల్ అంటూ ఒకటి లేకపోవడంతో ఫైట్స్ కి వూపే రాలేదు ప్రేక్షకుల్లో. ఇక తన సాహో పాత్ర గురించిన ఫ్లాష్ బ్యాక్ రొటీన్ విషయమే.
మూడు గంటల మెగా నిడివి ఒక పొరపాటు నిర్ణయం. ఈ మధ్య తెలుగు సినిమాలు అదుపు తప్పిన నిడివితో ఉంటున్నాయి. నిడివితో బాటు దర్శకత్వంలో అపరిపక్వత కొట్టచ్చినట్టు బయటపడడం ‘సాహో’ ప్రత్యేకత. ఒకరిద్దరు తప్ప మొత్తం హిందీ నటులే భారీగా కన్పించడంతో తెలుగు సినిమాయే చూస్తున్నామా అన్న ఫీలింగ్ కూడా ఓ పక్క.
ఈ మూవీలో టెక్నాలజీ వుంది, కథ చెప్పే టెక్నిక్ లేకపోవడమే లోపం. మార్కెట్ యాస్పెక్ట్ లేని కథకి యూత్ అపీలైనా కుదరలేదు. ప్రభాస్ ఇంకా ‘బాహుబలి’ హేంగోవర్ తో రెండేళ్ళు ఒకే సినిమా చేస్తూ కూర్చోక, ఏడాదికి ఓ రెండు సినిమాలు చకచకా చేసుకుంటూ ప్రేక్షకుల్లో వుంటే మేలు. ఎంతాలస్యం చేస్తే అంత ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి.
రచన – దర్శకత్వం : సుజీత్
తారాగణం : ప్రభాస్, శ్రద్ధా కపూర్, మందిరా బేడీ, ఈవిలిన్ శర్మ, జాక్విలీన్ ఫెర్నాండజ్, జాకీ ష్రాఫ్, నితిన్ నీల్ ముఖేష్, చంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, టిన్నూ ఆనంద్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : శంకర్ – ఎహెసాన్ – లాయ్, జిబ్రాన్, కెమెరా : మాధి, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, యాక్షన్ : కెన్నీ బేట్స్
బ్యానర్స్ : యూవీ క్రియేషన్స్, టీ సిరీస్
నిర్మాతలు : వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్
విడుదల : ఆగస్టు 30, 2019
2 / 5
-సికిందర్