సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి తమిళంలో నిర్మించిన ‘కదంబన్’ తెలుగులో ‘గజేంద్రుడు’ గా ఈ నెల 21 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ అడవుల్లో మరో గిరిజన పోరాటాన్ని ఆవిష్కరిస్తోంది. కదంబన్ తమిళనాడులో అతి పెద్ద అటవీ ప్రాంతం. ఇక్కడ సున్నపు రాయి విశేషంగా లభిస్తుంది. దీని మీద కన్నేసిన సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ మహేంద్ర బ్రదర్స్, అక్కడి గిరిజనులని ఖాళీ చేయించే పన్నాగానికి తెగబడతారు. అక్కడి గిరిజన వీరుడైన ఆర్య దీన్ని ఎదుర్కొని పోరాడతాడు…
‘మన తాతలు ముత్తాతలు చూసిన జంతుల్లో సగం మన అయ్యలు చూడలేదు. మన అయ్యలు చూసిన మిగతా సగం జంతువుల్ని మనం చూడలేదు…’ అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ గిరిజన యువకుడిగా ఏనుగుల బ్యాక్ డ్రాప్ లో ఆర్య చేసే సాహస కృత్యాలతో ఓపెనవుతుంది. సిమెంట్ కంపెనీ వాళ్ళు అడవినీ, గూడేల్నీ ధ్వంసం చేసుకుంటూ వచ్చేస్తూంటారు. గిరిజనులు నిస్సహాయంగా పారిపోతూంటారు. అప్పుడు ఇది అంతం కాదు, ఆరంభమని తన యుద్ధ కళల్ని ప్రదర్శిస్తూ ఆర్య వచ్చేస్తాడు.
కథ కొత్తగా అన్పించక పోయినా అడవిలో పోరాటాలు కొత్తగా వున్నట్టు అన్పిస్తున్నాయి. హీరోయిన్ కేథరిన్ ట్రెసాతో రోమాన్స్ కూడా వుంది. అడవిలో ప్రకృతి దృశ్యాల రమ్యమైన కెమెరా వర్క్ కూడా వుంది. యువన్ శంకర్ రాజా ట్యూన్స్ కూడా అందుకు తగ్గట్టే వున్నాయి.
అయితే ఇది తమిళంలో 2017 లోనే విడుదలయింది. తెలుగులో ఆలస్యంగా విడుదలవుతోంది. తమిళ స్టార్ ఆర్య తెలుగు ప్రేక్షకులకి పరిచితుడే. చాలా కాలానికి తెలుగులో ఆర్ బి చౌదరి సినిమా రావడం ఆసక్తి కరమే. ఈ ఆకర్షణలతో ‘గజేంద్రుడు’ తెలుగు ప్రేక్షకులని అలరించేందుకు ఈ నెల 21 న వచ్చేస్తున్నాడు.