చిరంజీవితో చెయ్యడానికి రెడీయేగానీ.!

యంగ్ హీరో కార్తికేయ, చాలా గ్యాప్ తర్వాత హిట్టు కొట్టాడు.. ‘బెదురులంక 2012’ సినిమాతో.! నేహా శెట్టి హీరోయిన్. వాస్తవానికి, ఈ సినిమా విడుదలకు ముందు బాలారిష్టాలే ఎదురయ్యాయ్. కానీ, సినిమా ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమించి, థియేటర్లలోకి వచ్చింది. మంచి విజయాన్ని కూడా అందుకుంది.

తనకు ఇంత పెద్ద హిట్ రావడానికి, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులే కారణమని చెబుతున్నాడు కార్తికేయ. నిజమే, చిరంజీవితోపాటు రామ్ చరణ్ కూడా ‘బెదురు లంక’ సినిమాకి ఆశీస్సులు అందించిన సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, సినిమా హిట్టయ్యాక కార్తికేయ, నేరుగా చిరంజీవిని కలిశాడట. ఈ క్రమంలో ఓ సినిమాలో కలిసి నటించాలని వుందంటూ కార్తికేయ, తన మనసులో మాటని చిరంజీవి వద్ద బయటపెట్టాడట. కానీ, చిరంజీవి ప్రస్తుతం అలాంటి ఆలోచనతో ఏమీ వున్నట్లు కనిపించడంలేదు.

‘భోళా శంకర్’ పరాజయం కంటే, ఆ సినిమా పట్ల వచ్చిన నెగెటివిటీ పట్ల చిరంజీవి ఒకింత ఆవేదనతో వున్నారు. ‘ఒక్క సినిమా ఫెయిల్యూర్ వల్ల చిరంజీవిని విమర్శించడం తగదు.. ఆయన శిఖరం..’ అని చిరంజీవి తరఫున ఇప్పటికే వకాల్తా పుచ్చుకున్నాడు కార్తికేయ.

చిరంజీవి పిలిస్తే, ఎప్పుడైనాగానీ ఆయనతో కలిసి నటించడానికి సిద్ధమని కార్తికేయ అంటున్నాడు. ఇదే మాట చిరంజీవిని కలిసినప్పుడూ చెప్పాడట.