యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంభాలె తెరకెక్కించిన చిత్రం ‘ఆర్టికల్ 370’ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై కొన్ని దేశాలు నిషేధం విధించడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. కొన్ని సన్నివేశాలు ఆందోళనకరమైన ధోరణిలో ఉన్నాయని అందుకే నిషేధించినట్టు సమాచారం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించిన యామీ గౌతమ్ ‘ఆర్టికల్ 370’ దేశంపై ఉన్న భక్తితో తెరకెక్కించిన సినిమా అని తెలిపారు. ‘సినిమా చూడకుండానే తీర్పు చెప్పేవారు ఉంటారు. కానీ ఆర్టికల్ 370 నిషేధాన్ని మేము ఊహించలేదు. ఇందులో ఆందోళనకరమైన సన్నివేశాలు లేవు. ప్రేరణ కలిగించే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మంచి సినిమా చూసి ఇంటికి వెళ్తున్నామన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. అది మా చిత్రబృందానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
సినిమా చూశాక తీర్పు చెప్పాలి కానీ ముందే ఎలా ఓ నిర్ణయానికి వస్తారు? ఈ సినిమా కశ్మీర్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రచారం కోసం చేసింది కాదు‘ అని యామీగౌతమ్ వెల్లడించారు. కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో యామీగౌతమ్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా యాక్షన్ అవతారంలో నటించారు. ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.