‘చంద్రముఖి’గా కంగనా మెప్పించేనా?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా 2005లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘చంద్రముఖి’. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘మణిచిత్రతాళ్‌’ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు పి.వాసు తలైవాతో రీమేక్‌ చేశారు. జ్యోతిక టైటిల్‌ పాత్రలో నటించగా శివాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నటుడు ప్రభు, అతని సోదరుడు రామ్‌ కుమార్‌ గణేషన్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా మరోసారి రుజువు చేసి కాసుల వర్షం కురిపించింది. తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్‌ వద్ద రజనీ కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇందులో రజనీ మేనరిజమ్స్‌,స్టయిల్స్ ఒకెత్తయితే కళ్లతో అద్భుతాభినయాన్ని కనబరిచి భయపెట్టిన జ్యోతిక నటన మరో ఎత్తు. కళ్లతో అభినయించిన జ్యోతిక తలైవానే డామినేట్‌ చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

క్లైమాక్స్‌లో కళ్లతో జ్యోతిక చేసిన అభినయానికి ఫిదా కాని ప్రేక్షకుడు లేడంటే అది అతిశయోక్తి కాదేమో. ఇన్నేళ్ల విరామం తరువాత ’చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌ని లైకా ప్రొడక్షన్స్‌ వారు తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇందులో రజనీ లేరు. జ్యోతిక అంతకన్నా లేదు. రాఘవ లారెన్స్‌, కంగన రౌత్‌ నటించారు. పి. వాసు డైరెక్ట్‌ చేశారు.

‘చంద్రముఖి’ అనగానే అంచనాలు కచ్చితంగా ఉంటాయి. అదే ఈ సినిమాకు బిగ్‌ డ్యామేజ్‌ అయ్యేలా కనిపిస్తోంది. కీలక పాత్రల్లో రజనీ, జ్యోతికలని చూసిన ప్రేక్షకులు ఆ పాత్రల్లో ఇతరులని ఊహించుకోలేరు. ఇప్పుడు ‘చంద్రముఖి 2’ విషయంలో ఇదే జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘స్వాగతాంజలి’ అంటూ సాగే ఓ లిరికల్‌ వీడియోని విడుదల చేశారు.

దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘చంద్రముఖి’ పాత్రలో కంగన ఏం చేసినా జ్యోతికని మరిపించలేకపోతోంది. ఇదే ఈ సినిమాపై ప్రేక్షకులు విమర్శలు చేసేలా చేస్తోంది. గణేష్ చతుర్ధి సందర్భంగా పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ కానున్న ‘చంద్రముఖి 2’ బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ చేస్తుందా? అన్నది అనుమానమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.