టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తవ్వగా, త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా కూడా ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కబోయే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అనిల్ రావిపూడితో మరో ఎంటర్టైనర్ కూడా స్టార్ట్ కానుండటంతో, చిరు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
అయితే, ఇప్పటి వరకు రాజమౌళి, చిరంజీవి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాలేదు. గతంలో ఒక ప్రాజెక్ట్ మాట్లాడుకున్నట్లు వార్తలు వచ్చినా, అవి అమలుకాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరు, జక్కన్నతో సినిమా చేయాలన్న ఆలోచనపై స్పందించారు. “రాజమౌళి గారు సినిమాకు చాలాకాలం వెచ్చిస్తారు. నాలుగేళ్లు, ఐదేళ్ల వరకు ఒకే ప్రాజెక్ట్‌తో ఉండటం సాధ్యపడదు. నేను ఒకేసారి మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తుంటాను. రోజుకు నాలుగు గంటలు ఓ సినిమాకు కేటాయించాల్సి వస్తుంది. అలాంటి షెడ్యూల్‌కు జక్కన్న స్టైల్ సెట్ కాదు” అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో, చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ చూడాలని ఆశించిన అభిమానులకు కొంత నిరాశే తప్పలేదు. అయితే చిరు చెప్పినది నిజమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ప్రతీ సినిమాను ఆరేళ్ల ప్రయాణంలా తీర్చిదిద్దుతారు. సీనియర్ నటుడిగా చిరు ఏటా రెండు సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుండటంతో, జక్కన్న లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపించకపోవడం సహజమే.
ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చిరు కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “పాన్ ఇండియా గ్లామర్ కోసం జక్కన్నతో సినిమా చేయాలనే అవసరం నాకు లేదు” అని చెప్పిన మెగాస్టార్ ఆత్మవిశ్వాసం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే భవిష్యత్తులో తత్వం మారితే, మెగా మాస్ కాంబో ఓ రోజు తెరపై కనిపించకమానదనే ఆశ మాత్రం అభిమానుల్లో ఉంది.