Babita Phogat: ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ టీమ్‌పై రెజ్లర్ బబితా ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తమ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘దంగల్’ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేపర్లో వచ్చిన కథనం చదివి దర్శకుడు నితేశ్ తివారీ తమని సంప్రదించారని తెలిపారు. చండీగఢ్‌కు చెందిన ఒక విలేకరి మా కుటుంబంపై (మహవీర్, ఆయన ఇద్దరు కుమార్తెలు గీత, బబిత) ఒక కథనాన్ని ప్రచురించాడు.
ఆ వార్త చదివి బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ టీమ్ మమ్మల్ని సంప్రదించింది. మాపై ఒక డాక్యుమెంటరీ సిద్ధం చేయాలనుకుంటున్నానని ఆయన మాతో చెప్పారు. 2010లో ఇది జరిగింది. కొంతకాలానికి ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేసి మమ్మల్ని కలిశారు. తాను సినిమా తెరకెక్కిస్తానని అన్నారు. కథ చెప్పారు. మేము చాలా ఎమోషనల్ అయ్యాం. అయితే, సినిమాలో మా పేర్లు వాడాలనుకోవడం లేదని చెప్పగా.. నా తండ్రి అంగీకరించలేదు. సినిమా చేస్తే మా పేర్లతోనే చేయమని చెప్పారు.
‘దంగల్’ రిలీజ్ అయ్యాక.. మా కుటుంబం మొత్తం సినిమా చూశాం. నా చిన్ననాటి రోజులు గుర్తుకువచ్చి భావోద్వేగానికి గురయ్యానని బబిత తెలిపారు. ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేసినప్పటికీ తమకు మాత్రం కోటి రూపాయిలు మాత్రమే అందాయని అన్నారు. ‘దంగల్’ సక్సెస్ అయ్యాక ఆమిర్‌ఖాన్ టీమ్‌ను తన తండ్రి సంప్రదించినట్లు చెప్పారు. తమ గ్రామంలో అకాడవిూ నిర్మించేందుకు సాయం చేయమని కోరగా.. అస్సలు పట్టించుకోలేదన్నారు.
అకాడవిూ నిర్మాణానికి రూ.5 కోట్లు వరకూ ఖర్చు అవుతుందని.. అంత డబ్బు తమ వద్ద లేదని అందుకే టీమ్‌ను సంప్రదించామని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడంటూ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ పై భారత స్టార్ రెజ్లర్లు దిల్లీ వీధుల్లో చేసిన ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ నిరసన ఆలోచనతో భాజపా నేత బబితా ఫొగాట్ తమను సంప్రదించారని సాక్షిమాలిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
దీనిపై తాజాగా బబిత స్పందించారు. ఆమె పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. లైంగిక వేధింపుల విషయంలో ఆమె నాపై విమర్శలు చేసినా చేస్తారు. గంగానదిలో పతకాలను వదిలేయాలనే ఆలోచన కూడా బబితదే అని చెప్పినా చెప్తారు. అసలు నిరసన వేదిక వద్దకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఎవరి కోసం ఆహారం పంపారు..? ఆ విషయంపై సాక్షి స్పష్టత ఇవ్వాలని వ్యాఖ్యానించారు.