Vishwak Sen: విశ్వక్ సేన్.. వరుస డిజాస్టర్స్ తరువాత ఏం ప్లాన్ చేస్తున్నాడు?

టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ రేసులో వెనుకబడినట్లు కనిపిస్తున్నాడు. వరుసగా వచ్చిన రెండు సినిమాలు మెకానిక్ రాకీ – లైలా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. లైలా అయితే 6 కోట్ల వరకు నష్టాలను కలిగించింది. ప్రేక్షకుల్లో తన సినిమాలపై ఉన్న క్రేజ్ కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది. కానీ, విశ్వక్ ఎప్పుడూ వెనుకడుగు వేసే మనిషి కాదు. దూకుడు, ఒత్తిడికి లోనుకాకుండా మళ్లీ తన మార్క్ చూపించేందుకు కొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం ఆయన ఫంకీ అనే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. విశ్వక్ సరసన డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆసక్తిని పెంచగా, విశ్వక్ మళ్లీ తన సరికొత్త యాంగిల్‌ను చూపించబోతున్నాడని అంటున్నారు. ఇదే కాకుండా, ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు టాక్. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన తొలి పార్ట్ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలాగే మరో కొత్త యూత్ కంటెంట్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు ప్రాజెక్టులతో విశ్వక్ తన కెరీర్‌ను మళ్లీ ఫాస్ట్ ట్రాక్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే, అసలు విశ్వక్ హిట్ ఫ్రాంచైజీలో నటించబోతున్నాడా లేదా అనే చర్చ నడుస్తోంది. మొదట్లో హిట్ 3 లో అతడి పాత్ర ఓ గెస్ట్ రోల్‌గా ఉంటుందని, కానీ అది మరో పార్ట్‌కు లింక్ అవుతుందని సమాచారం. కానీ కథ, స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా క్లారిటీ లేకపోవడంతో, విశ్వక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. నిర్మాతలు అతడి పాత్రకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం కూడా దీనికి ఒక కారణమని అంటున్నారు.

ఈ నిర్ణయం తీసుకోవడం విశ్వక్ కెరీర్‌కు ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రస్తుతం అందరి దృష్టి ఫంకీ సినిమాపైనే ఉంది. ఈ చిత్రం విశ్వక్ కోసం చాలా ముఖ్యమైనది. టోటల్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు సమాచారం. మాస్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా విశ్వక్ కెరీర్‌కు మళ్లీ ఊపు తెస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి, వరుస పరాజయాల తర్వాత విశ్వక్ తన కెరీర్‌ను ట్రాక్‌పైకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

కూటమి శూన్యం || M V Mysura Reddy EXPOSED Chandrababu & PawanKalyan Ruling || YsJagan || TeluguRajyam