విజయ్ అంటోనీ హీరోగా ప్రేక్షకుల ముందుకి వస్తోన్న సినిమా బిచ్చగాడు 2. ఈ మూవీ 2016లో వచ్చిన బిచ్చగాడుకి సీక్వెల్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఆ మూవీ తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. విజయ్ అంటోనీ క్రేజ్ కూడా అమాంతం పెంచింది. బిచ్చగాడు మూవీలో తల్లి సెంటిమెంట్ మూవీకి ప్లస్ అయ్యింది. దీంతో భారీ లాభాలు నిర్మాతకి అందించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు దానికి సీక్వెల్ గా బిచ్చగాడు 2 ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ మూవీకి విజయ్ అంటోనీ కథ అందించడం విశేషం. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగులో మంచి బిజినెస్ డీల్ వచ్చింది. మూవీపై మొత్తం ఆరు కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. నైజాంలో 2.2 కోట్లు, ఆంధ్రాలో కోటి, సీడెడ్ లో 2.8 కోట్ల బిజినెస్ జరిగిందంట.
అలాగే ఈ మూవీలో తెలుగు రాష్ట్రాలలో 300 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ విధంగా ఇది పెద్ద నెంబర్ అని చెప్పాలి. మొదటి మూవీ హిట్ అయిన నేపథ్యంలో బిచ్చగాడు 2పైన కూడా మంచి బజ్ ఉంది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అయితే గట్టిగా ప్రమోషన్స్ చేయకపోయిన మౌత్ టాక్ తో జనలోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.
మే 19న తెలుగు, తమిళ్ భాషలలో ఏక కాలంలో సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళంలో ఈ మూవీపై 10 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. బిచ్చగాడు సినిమా కోలీవుడ్ లో 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇప్పుడు అంతే బిజినెస్ తో రిలీజ్ అవుతోంది. ఇక ఈ మూవీకి తెలుగులో బ్రేక్ ఈవెన్ రావాలంటే 6.5 కోట్లు వస్తే సరిపోతుంది.
అయితే ఆ కలెక్షన్స్ ని ఏ మేరకు విజయ్ అంటోనీ సాధిస్తాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ గా ఉంది. ప్రస్తుతం సమ్మర్ హీట్ ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ తగ్గిపోయారు. అయితే మూవీకి హిట్ టాక్ వస్తే మాత్రం వీకెండ్స్ లో క్యూ కట్టడం గ్యారెంటీ. మరి ప్రేక్షకులని మొదటి సినిమా స్థాయిలో ఈ మూవీ ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.