వరుణ్ సందేశ్ సతీమణి వితికా షెరు పలు తెలుగు సినిమాలలో కథానాయికగా నటించినప్పటికీ పెద్దగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 3లో తన భర్తతో కలిసి హౌజ్‌లోకి అడుగుపెట్టిందో అప్పటి నుండి వితికా పేరు మార్మోగిపోయింది. బిగ్ బాస్ తర్వాత కూడా వితికా తన హవాని కొనసాగిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో వెరైటీ పోస్ట్‌లు పెడుతూ అందరి దృష్టి ఆకర్షిస్తుంది. అయితే సోమవారం తన చెల్లెలు కృతికా షెరు వివాహం క్రిష్ణ అనే వ్యక్తితో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది వితికా.
కృతికా షెరు.. నా బంగారుతల్లి.. నీ పెళ్లి గురించి , నా పెళ్లి కన్నా ఎక్కువ కలలు కన్నాను. అందుకే కష్టపడి, చాలా ఇష్టపడి నీ పెళ్లి చేశాను. నువ్వు నాకు చెల్లిలా పుట్టావు కాని నేను నిన్ను తల్లిలా పెంచుకున్నా. ఈ క్షణం గురించి సుమారు 20 ఏళ్లుగా కలలు కంటూనే ఉన్నాను. నా కల నిజమైనందుకు, నీ పెళ్లి స్వయంగా నేనే చేసినందుకు గర్వంగా ఉంది. నీకు అండగా నేను ఎప్పుడూ ఉంటాను. కానీ, నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని.. నీకు నా అవసరం కానీ, ఇంకెవ్వరి అవసరం కానీ రాకూడదని కోరుకుంటున్నాను. నువ్వు కొత్త ఇల్లు కొనుక్కోవాలి. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలి. ఐ లవ్ యు. ఇప్పటి నుంచీ నువ్వు చేసే ప్రతి పనీ నేను గర్వపడాలే చేయాలి. నీ వైవాహిక జీవితానికి నా శుభాకాంక్షలు. ఆ దేవుడు మీ ఇద్దరినీ చల్లగా చూడాలి. క్రిష్ బాగా చూస్కో..!’’ అని వితిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
వితికా ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తూ వస్తుంది. ఓ పాటల కార్యక్రమానికి యాంకర్‌గా కూడా పని చేస్తుంది. మరోవైపు వరుణ్ సందేశ్ మొన్నటి వరకు యూఎస్‌లో ఉన్నాడు. పెళ్ళి కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చాడు. మంచి కథ దొరికితే సినిమా చేయాలనుకుంటున్న వరుణ్ ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది.