సంక్రాంతి తరువాత వెంకీ ప్లాన్ ఏంటీ?

సీనియర్ హీరో వెంకటేష్ తన తదుపరి సినిమాలపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ఆయన, వచ్చే ఏడాది జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వెంకటేష్ తదుపరి ప్రాజెక్ట్‌లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటివరకు రెండు కథలు ఆయనకు వినిపించబడినట్లు తెలుస్తోంది. మొదటిది, సామజవరగమన రచయితల్లో ఒకరైన నందు చెప్పిన కథ. వెంకటేష్‌కి ఈ కథ బాగా నచ్చినా, పూర్తి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు. దీనిపై సురేష్ బాబు ఆమోదముద్ర వేసిన తర్వాతే తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరో ప్రాజెక్ట్ డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణతో ఉండవచ్చని సమాచారం. వినోదం, యాక్షన్ కలగలిపిన కథాంశంతో ఈ సినిమా వెంకటేష్‌ కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వెంకటేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన తన వయసుకు తగ్గ పాత్రలతో, కుటుంబ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కథలను ఎంపిక చేస్తున్నారు. ఎఫ్2, ఎఫ్3 సినిమాల విజయాల తర్వాత, ప్రేక్షకులు ఆయనను వినోద ప్రధానమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నారనే స్పష్టత ఆయనకు వచ్చింది. అందుకే యాక్షన్ ప్రధానమైన సినిమాలను కొంత కాలం దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.